తెలంగాణ

telangana

ETV Bharat / city

మినీ పోల్స్​: పోలింగ్​లో కరోనా నిబంధనలు.. పాటించకుంటే కఠిన చర్యలు​

కొవిడ్ కల్లోలంలోనే ఈనెల 30న మినీ పురపోరు జరగనుంది. వరంగల్, ఖమ్మం నగరపాలికలతో పాటు మరో ఐదు పురపాలికలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న వేళ... పోలింగ్ నిర్వహణలో జాగ్రత్తగా వ్యవహరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

corona rules in khammam corporation election polling
corona rules in khammam corporation election polling

By

Published : Apr 28, 2021, 6:35 PM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్రంలో మినీ పురపోరు పోలింగ్‌... కరోనా మీద సాములా మారింది. ఈ నెల 30న రెండు నగరపాలికలు, ఐదు పురపాలికలతో పాటు మరో ఐదు చోట్ల ఉపఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉండగా.. రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల నాగార్జునసాగర్ ఉపఎన్నికతో భారీగా కరోనా కేసులు వెలుగు చూశాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా మినీ పురపోరులో కరోనా జాగ్రత్తలు కఠినంగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ, ఎన్నికల సంఘం జారీ చేసిన కొవిడ్‌ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని తెలిపింది. ఎన్నికలు జరుగుతున్న ప్రతీ వార్డుకు వైద్య, ఆరోగ్యశాఖ తరపున నోడల్ అధికారిని నియమించి పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఆశావర్కర్లు, హెల్త్ వర్కర్లను అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించేలా చూడాలని.. పోలింగ్‌కు వీలైనంత వరకు పెద్దహాళ్లను ఉపయోగించాలని ఎస్​ఈసీ స్పష్టం చేసింది. శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని.. ఆరడుగుల కనీస భౌతికదూరం పాటించాలని తెలిపింది. ఎండ తీవ్రత దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల వద్ద షామియానాలు, కుర్చీలు, మంచినీళ్లు తదితర ఏర్పాట్లు చేయాలని నిర్దేశించింది.

మాస్కు లేకుంటే నో ఎంట్రీ...

పోలింగ్ కేంద్రం బయట ఓటర్లకు క్యూలెన్లు మార్కింగ్ చేయాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం.... మహిళలు, పురుషులతో పాటు దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్లకు వేర్వేరుగా క్యూలైన్లు పెట్టాలని ఆదేశించింది. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, గర్భిణీలు, చిన్నపిల్లల తల్లులకు క్యూతో సంబంధం లేకుండా పోలింగ్ కేంద్రంలోకి నేరుగా పంపేలా చూడాలని సూచించింది. పోలింగ్‌ కేంద్రంలో కొవిడ్‌ మార్గదర్శకాలు అమలయ్యేలా బీఎస్​వోలు, ఇతర సిబ్బంది, వాలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. పోలింగ్ కేంద్రం లోపల విధుల్లోని సిబ్బంది, ఏజెంట్లు భౌతికదూరం పాటిస్తూ కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని తెలిపింది. ఏజెంట్లకు ఎవరికైనా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే తక్షణమే మరొకరిని అనుమతించాలని ఎస్​ఈసీ స్పష్టం చేసింది. మాస్కు లేకుండా ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించరాదని.. సిబ్బంది ఎదుట ఒకరికి మించకుండా ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది రాకపోకలకు కొవిడ్ నిబంధనలకు లోబడి తగినన్ని వాహనాలను సమకూర్చాలని, ఆరోగ్యసేతు యాప్‌ను వినియోగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ సిబ్బంది, పోలీసులకు మాస్కు, శానిటైజర్, ఫేస్ షీల్డ్, చేతి గ్లౌజులతో కూడిన ప్రత్యేక కిట్ ఇవ్వాలని పేర్కొంది.

ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచడంతో పాటు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించేలా చూడాలని సూచించింది. సిబ్బంది చేరుకునేలోపే పోలింగ్ కేంద్రం ప్రాంగణం, ఫర్నీచర్‌ను శానిటైజేషన్ చేయాలని తెలిపింది. బ్యాలెట్ బాక్సులు రాకముందే స్ట్రాంగ్ రూంలను కూడా పూర్తిగా శానిటైజేషన్ చేయాలని ఎస్​ఈసీ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: వచ్చే మూడు, నాలుగు వారాలు కీలకం: డీహెచ్‌ శ్రీనివాస్‌

ABOUT THE AUTHOR

...view details