ఎన్ని కేసులు పెట్టినా.. పక్కటెముకలు విరిగిపోయేలా కొట్టినా.. ప్రజల పక్షాన పోరాడుతున్నందునే బల్మూరి వెంకట్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ఆయన ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. 'ఉద్యోగాల భర్తీ కోసం ఈటల ఎప్పుడైనా పోరాడారా?.. దళితులకు మూడెకరాల గురించి ఈటల ఎప్పుడైనా ప్రశ్నించారా?..అమరవీరుల కుటుంబాలకు సాయంపై ఈటల ఎప్పుడైనా కొట్లాడారా?' అని రేవంత్ నిలదీశారు.
కాంగ్రెస్ తరఫున పోటీచేస్తున్న బల్మూరి వెంకట్ గెలిచినా ఓడినా ప్రజల పక్షాన పోరాడుతారని రేవంత్ స్పష్టం చేశారు. ప్రజల కోసం యుద్ధం చేసినోళ్లు కావాలా.. ఓట్ల కోసం డబ్బులు పంచినోళ్లు కావాలా హుజూరాబాద్ ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ బరిలో నిలవడం వల్ల ఇరు పార్టీల అభ్యర్థులు చెరో 120 కోట్లు రూపాయలు పంచారని.. అంటే మొత్తం రూ.240 కోట్ల సొమ్ము హుజూరాబాద్ ప్రజలకు చేరిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇవాళ సాయంత్రం నుంచి పోలింగ్ తేదీ వరకు గల్లీ గల్లీ తిరిగి గస్తీ కాయాలని.. ఎవరు డబ్బు పంచినా గుంజుకోవాలని సూచించారు.