ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అహర్నిషలూ కృషి చేస్తోందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. జిల్లాలో రెండో డోస్ వ్యాక్సినేషన్ నూటికి నూరు శాతం పూర్తి చేసి రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిన క్రమంలో కరీంనగర్ కలెక్టరెట్ ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేడుకలల్లో భారీ సిరంజి ప్రదర్శించడమే కాకుండా కేక్‌కట్ చేసి వైద్య ఆరోగ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. గతంలో కరీంనగర్‌ను భయపెట్టిన కరోనా.. నేడు కరీంనగర్‌ను చూసి కరోనానే భయపడే స్థాయికి చేరిందని పేర్కొన్నారు.
"ఒకప్పుడు కల్లోల జిల్లాగా పేరున్న కరీంనగర్ ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతూ.. కళకళలాడుతోంది. 2001లో సింహగర్జనను కేసిఆర్ కరీంనగర్‌లోనే ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కాళేశ్వరం జలాలతో నేడు రాష్ట్రంలో కోటి ఎకరాలకు పైగా సాగు అవుతోంది. వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో రెండో డోస్ వ్యాక్సినేషన్‌ను 100 శాతం పూర్తిచేయడం అభినందనీయం. ఇదే క్రమంలో 3వ దశ కొవిడ్‌ను కూడా కట్టడి చేసి ముందుకు సాగాలి. ఈ విజయం కేసిఆర్‌కే అంకితం. కొవిడ్‌కు భయపడవద్దు. ధైర్యమే మందుగా భావించి ముందుకు సాగాలి. ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంది."-గంగుల కమలాకర్, మంత్రి.