కరీంనగర్ పార్లమెంటులో త్రిముఖ పోరు ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్ లోక్‌సభ పోరు రసవత్తరంగా మారింది. ఎప్పటికప్పుడు విలక్షణ తీర్పు ఇచ్చే ఓటర్లు... అన్ని పార్టీలను ఆదరించారు. కేసీఆర్‌ను మూడుసార్లు గెలిపించి ఉద్యమానికి అండగా నిలబడ్డారు. బోయినపల్లి వినోద్ కుమార్ తెరాస తరఫున మరోసారి పోటీలో నిలిచారు. అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చేందుకు కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ సిద్ధమవుతున్నారు. తొలిసారిగా బరిలో దిగుతున్న భాజపా అభ్యర్థి బండి సంజయ్ కుమార్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. త్రిముఖ పోరులో ఉద్యమాల ఖిల్లా నుంచి దిల్లీకి పోయేదెవరోనని ఉత్కంఠ నెలకొంది.
అధినేత బలంతో...
2014లో తెరాస తరఫున గెలిచిన బోయినపల్లి వినోద్ కుమార్ మరోసారి రంగంలో ఉన్నారు. కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ హోదా సాధించడంతోపాటు నియోజకవర్గాల అభివృద్ధికి బాటలు వేశామనే ధీమాతో ఓటర్ల దగ్గరకు వెళ్తున్నారు. రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన వినోద్ కుమార్‌ను భవిష్యత్తులో ఉన్నత పదవి వరిస్తుందన్న కేసీఆర్ వ్యాఖ్యలు కొండంత బలాన్నిచ్చినట్లైంది. కరీంనగర్ సభలో అధినేత వ్యాఖ్యలు కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపాయి. కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ రోడ్ షోలు, మంత్రి ఈటల రాజేందర్ పటిష్ట ప్రచార వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. నియోజకవర్గ పరిధిలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలు ఉండటం, తెరాస చేసిన అభివృద్ధి విజయానికి దోహదం చేస్తాయని విశ్వసిస్తున్నారు. స్థానికంగా అందుబాటులో ఉండరనే అపవాదు ప్రతికూలాంశం.
అభివృద్ధిపై నమ్మకంతో...
గతంలో ఎంపీగా చేసిన అభివృద్ధి, అనుభవం కలిసొస్తుందని విశ్వాసంతో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన పొన్నం... ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు గళం వినిపించడం తనకు ప్లస్ పాయింట్గాభావిస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో బలమైన కాంగ్రెస్ క్యాడర్, పార్టీపై పట్టు, బీసీ సామాజికవర్గం పొన్నంకుఅనుకూలాంశాలు. ఇటీవలఅసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి సానుభూతిని పెంచుతుందని నమ్ముతున్నారు.
మోదీ ఇమేజ్‌పై ధీమాతో...
కేంద్రంలో సుస్థిర పాలన కోసం మరోసారి మోదీని గెలిపిద్దాం అనే నినాదంతో బరిలో నిలుస్తున్నారు భాజపా అభ్యర్థి బండి సంజయ్ కుమార్. దేశ భద్రతకు కేంద్రనిర్ణయాలు అనుకూలంగా మారుతాయని విశ్వసిస్తున్నారు. హిందూ ధర్మ రక్షణ పోరాటాలు, నేరెళ్ల బాధితుల తరఫున ఆందోళనలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి, బలహీన వర్గాల ఆదరణ, యువతలో ఆకర్షణ బలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడి నుంచి గతంలో రెండు సార్లు విద్యాసాగర్రావునుగెలిపించిన ఓటర్లు తననూ ఆదరిస్తారన్న విశ్వాసంతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం నిధులు ఉన్నాయనే అంశాన్ని ప్రచారాస్త్రంగాప్రజల్లోకి వెళ్తున్నారు. పార్టీకి పటిష్ఠ క్యాడర్ లేకపోవడం, సీనియర్ల సమన్వయ లోపం ప్రతికూలాంశాలు.
పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్నందున అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అధినేతలు, ముఖ్యనాయకుల సభలు ఏర్పాటు చేసి ఓటర్లను ఆకర్షించేందుకు పోటీపడుతున్నారు.
ఇవీ చూడండి:నేతల వలసలతో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి