దుబ్బాకలో భాజపా గెలవబోతోందని ఆ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎన్నికలను వాయిదా వేయించాలనే తెరాస కుట్రలు పన్నుతోందని సంజయ్ ఆరోపించారు. అధికార పార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని.. ఫలితంగా భాజపా నేతలే లక్ష్యంగా తనిఖీలు చేపడుతున్నారని మండిపడ్డారు. తెరాస నేతల ఇళ్లలో తూతూమంత్రంగా సోదాలు చేస్తున్నారన్నారు. ప్రగతి భవన్లో డబ్బులు ఉన్నాయని తాము చెబుతున్నా.. అక్కడ ఎందుకు తనిఖీలు చేయడం లేదని ప్రశ్నించారు.
ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల జరగాలని తాము కోరుకుంటున్నట్లు సంజయ్ తెలిపారు. భాజపాను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారన్న సంజయ్.. దుబ్బాకలో కేసీఆర్ ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు. తమ కార్యకర్తలను బెదిరిస్తున్నారని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.