ముఖ్యమంత్రి కుట్రలను పటాపంచలు చేసి.. నియంత పాలనకు సమాధి కట్టేందుకు ప్రజలిచ్చిన ఇచ్చిన తీర్పే దుబ్బాక విజయమని ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లోని పార్టీ ఆఫీసులో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దుబ్బాకలో భాజపా గెలుపుకోసం కృషి చేసిన బండి సంజయ్‌ను పార్టీ శ్రేణులు సత్కరించారు. దుబ్బాకలో పార్టీని గెలిపించిన ప్రజలకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. దుబ్బాక విజయం పూర్తిగా కార్యకర్తలకు, పార్టీ కోసం ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్‌కు అంకితమన్నారు.
దుబ్బాక తరహాలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తెరాసకు గట్టిగా బుద్ధి చెప్పాలని బండి సంజయ్ కోరారు. వరద పరిహారం పార్టీ పరంగా ఇస్తోందా.. ప్రభుత్వపరంగా ఇస్తోందా? విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. డబ్బు ఏ బ్యాంక్ నుంచి డ్రా చేశారో? ఏమని ఉత్తర్వులు ఇచ్చారో? స్పష్టం చేయాలని సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేంద్రం ఏమిచ్చిందో అంటున్నారు. అన్ని కేంద్రం ఇస్తే ఇంక మీరేం చేస్తారో చెప్పాలి. ఆరోగ్య శాఖ మంత్రి తప్ప కరోనా సమయంలో ఏ మంత్రి పని చేయలేదు. సన్నరకం ధాన్యం పండించాలని ఏ ప్రాతిపదికన చెప్పారో స్పష్టం చేయాలి. ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్‌లో పండించిన పంటలకు ఎంత ధర నిర్ణయిస్తారో చెప్పాలి. కేంద్రాన్ని బద్నామ్ చేస్తే.. దుబ్బాక ప్రజల్లాగే భాగ్యనగర ప్రజలు కూడా తెరాసకు బుద్ధి చెబుతారు. మజ్లిస్ చెబితే తెరాస వింటుంది.. తెరాస చెబితే ఎన్నికల సంఘం వింటోంది. - బండి సంజయ్, ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.
హైదరాబాద్ మేయర్ స్థానాన్ని ఎంఐఎంకు అప్పగించేందుకు తెరాస లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని బండి సంజయ్ ఆరోపించారు. దీపావళి పండగ సందర్భంగా టపాసులు అమ్మకూడదని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఎందుకు వాదించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హిందువుల పండుగల సందర్భంలోనే ఇలాంటి వివాదాలు ఎందుకు తలెత్తుతాయో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. టపాసుల అమ్మకాలపై నిషేధం విధించినప్పుడు దానిపై ఆధారపడిన వారిని ఆదుకుంటామని హామీ ఇవ్వాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాల్సిన బాధ్యత ప్రజలదే: కేటీఆర్