నల్గొండ జిల్లా దామెరచర్ల వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో జాప్యానికి కాంట్రాక్టు సంస్థ భెల్(బీహెచ్‌ఈఎల్) నిర్లక్ష్యమే ప్రధాన కారణమని జెన్‌కో తాజాగా ప్రభుత్వానికి తెలిపింది. రాష్ట్రాన్ని కరెంటు కష్టాల నుంచి గట్టెక్కించాలని ఈ కేంద్ర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. దేశంలో థర్మల్ కేంద్రాల నిర్మాణాలు తగ్గుతున్న వేళ... ఏకంగా 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో దీని నిర్మాణాన్ని చేపట్టడం దేశం మొత్తాన్ని ఆకర్షించింది. రూ.29,965.48 కోట్ల వ్యయంతో దీని నిర్మాణాన్ని 2017 అక్టోబరు 17న ప్రారంభించారు. ఈ తేదీ నుంచి 48 నెలల్లో అంటే 2021 అక్టోబరు 17కల్లా ఇది పూర్తికావాలి. ఈ గడువులోగా పూర్తిచేయాలని టెండర్లు పిలవకుండా నేరుగా భెల్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటికే 26 నెలలు దాటింది. 20శాతం పనులైనా ఇంతవరకు కాలేదు. దీంతో జెన్‌కో వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
థర్మల్ విద్యుత్కేంద్ర నిర్మాణం ఆలస్యమైతే రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆర్థికభారం పడటమే కాకుండా కరెంటు కొనుగోలుకు వెచ్చించే అదనపు సొమ్ముతో ఎంతో నష్టం వస్తుంది. ఎలాగంటే ఈ ప్లాంటు నిర్మాణ తొలి అంచనా వ్యయం రూ.29,965.48 కోట్లు. ఈ సొమ్మును జాతీయ విద్యుత్ ఆర్థిక సంస్థ(పీఎఫ్‌సీ) నుంచి రుణంగా జెన్‌కో తీసుకుంది. భెల్‌కు ఇచ్చిన కాంట్రాక్టు విలువ రూ.20,379 కోట్లు. ఇందులో ఇప్పటికే రూ.5 వేల కోట్లను జెన్‌కో భెల్‌కు విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నిర్మాణ కాలానికి రుణంపై పడే వడ్డీ భారం రూ.4 వేల కోట్లు అని అంచనా వ్యయంలో చేర్చారు. 2021 అక్టోబరు 17 నాటికి ప్లాంటు పూర్తికాకపోతే మళ్లీ ఈ తేదీ నుంచి ఏటా రూ.వెయ్యి కోట్ల వరకు అదనపు వడ్డీ పడుతుందని అంచనా. ఈ నేపథ్యంలో పనుల ప్రగతిపై జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు సమీక్ష జరిపి భెల్ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.