సుప్రీంకోర్టు న్యాయమూర్తి సహా ఏపీ హైకోర్టు జడ్జిలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖపై.. సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టును అపకీర్తిపాలు చేసేలా లేఖ రాసిన జగన్.. దాన్ని బహిర్గతం చేసిన ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లంపై.. కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు లేఖ రాశారు.
నిరాధార ఆరోపణలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఏపీ సీఎం జగన్ రాసిన లేఖను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం బహిర్గతం చేశారని.. ఏజీ దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతీసేందుకే జడ్జిలపై ఆరోపణలు చేశారని.. అశ్వినీకుమార్ ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు. ఈ చర్యతో జగన్ న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య గీత దాటి ప్రవర్తించారని వివరించారు.
ప్రజాప్రతినిధుల కేసుల సత్వర విచారణ అంశంపై విచారణ జరుపుతున్నందు వల్ల... జస్టిస్ ఎన్వీ రమణపై నిరాధార ఆరోపణలతో విచారణ ఆపేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని అశ్వినీకుమార్ ఆరోపించారు. కోర్టులను భయభ్రాంతులకు గురిచేయాలన్న ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు ఉందన్నారు. లేఖ రాయడం, బహిర్గతం చేయడంపై.. అశ్వినీకుమార్ ఉపాధ్యాయ అనేక అనుమానాలు లేవనెత్తారు. ఆ లేఖను సీజేఐ స్థానానికి ముందువరసలో ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ సహా, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై దాడిగా అభివర్ణించారు.