ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ(vijayawada) చుట్టిగుంట సమీపంలో నివాసం ఉంటున్న మండవ కుటుంబరావుకు నాలుగు దశాబ్దాల క్రితం కాశీ అన్నపూర్ణతో వివాహమైంది. వ్యవసాయం- ప్రకృతి సేద్యంపై మమకారంతో తన కుమార్తెకు సస్య అని పేరు పెట్టి.. తమ నివాసాన్ని సస్యక్షేత్రంగా మార్చేశారు ఈ దంపతులు. నిత్యం బంధుమిత్రుల రాకపోకలతో సందడిగా ఉండే ఇంట్లో... ఏడాదిన్నర క్రితం నుంచి మౌనం ఆవహించింది. భార్య అన్నపూర్ణ అకాలమరణం కుటుంబరావును కోలుకోలేని దెబ్బతీసింది. జీవితాంతం తోడుగా నీడగా నిలుస్తుందనుకున్న సహధర్మచారిణి ఎడబాటును కుటుంబరావు తట్టుకోలేకపోయారు. ఆమె రూపాన్ని అతని కళ్ల నుంచి దూరం చేసుకోలేక నిరంతరం అన్నపూర్ణ గురించే ఆలోచిస్తుండేవారు.
తల్లి పుట్టిన రోజున తండ్రికి కానుక..
భార్య అన్నపూర్ణ ఆలోచనల నుంచి కుటుంబరావు బయటపడలేక పోవడాన్ని.. తన కుమార్తె సస్య గుర్తించింది. ఎలాగైనా తన తండ్రి ఒంటరితనాన్ని దూరం చేయాలనుకుంది. తన తల్లి పుట్టిన రోజు దగ్గరలోనే ఉందనే విషయాన్ని గుర్తు చేసుకుంది. వెంటనే విజయవాడలోని శిల్పశాల నిర్వాహకులతో చర్చించి... అన్నపూర్ణ విగ్రహాన్ని(silicone wax) తయారు చేయించింది. తన తల్లి పుట్టిన రోజున.. నాన్న పక్కన అమ్మను కూర్చోబెట్టాలనే తన పట్టుదలకు కార్యరూపం ఇచ్చింది. తన కుమార్తె ఆలోచన కాదనలేకపోయిన కుటుంబరావు … తన భార్య రూపాన్ని (wife statue) చూసి సజీవంగా తన చెంతనే ఉన్న అనుభూతిని పొందుతున్నారు.