ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత అభివృద్ధి కోసం సీఆర్డీఏను 2014లో ఏర్పాటు చేశారు. తొలుత ఇక్కడ ఉడా (విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటు చేశారు. తర్వాత విజయవాడ నగరపాలక సంస్థ, తెనాలి, మంగళగిరి, గుంటూరులను కలపి వీజీటీఎం-ఉడా కింద మార్చారు. దాని తర్వాత సీఆర్డీఏ ఏర్పాటు అయింది. దీనిని మొత్తం 3 వలయాలు.. సీడ్ క్యాపిటల్, రాజధాని నగరం, రాజధాని ప్రాంతంగా విభజించారు. సీడ్ క్యాపిటల్లో కేవలం సచివాలయం, పరిపాలన భవనాలు ఇతర కార్యాలయాలు ఉన్నాయి.
రాజధాని నగరం పరిధిలో మొత్తం 29 గ్రామాలు ఉన్నాయి. మొత్తం 22 నియోజకవర్గాలను చేర్చారు. కృష్ణా జిల్లాలో నాలుగు, గుంటూరులో 7 నియోజకవర్గాలను మినహాయించి అన్నింటినీ రాజధాని ప్రాంతంగా గుర్తించారు. ఇక్కడ లేఅవుట్లకు, ఇళ్ల నిర్మాణానికి సీఆర్డీఏ నుంచే అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అభివృద్ధి ప్రణాళికల్లోనూ దీనిదే కీలక పాత్ర. ఉడా భవనంలోనే ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి, కార్పొరేట్ హంగులు సమకూర్చారు.
గత జనవరిలోనే ఈ బిల్లును రూపొందించి సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటిన్ ప్రాంత అభివృద్ధి సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర పడినందున సీఆర్డీఏ పూర్తిగా రద్దు అవుతుందా.. లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. దీనిపై హైకోర్టులో పలు కేసులు పెండింగ్లో ఉన్నందున ఇప్పటికి ఇప్పుడు అమల్లోకి వస్తుందా లేదా అనేది చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీఆర్డీఏ మనుగడ కృష్ణా, గుంటూరు జిల్లాల వాసులకు ఆసక్తికర అంశంగా మారింది.
ఇక 217 చదరపు కి.మీ. వరకే...
ప్రభుత్వ నిర్ణయం అమలు జరిగితే ఏఎంఆర్డీ(అమరావతి మెట్రోపాలిటిన్ ప్రాంత అభివృద్ధి సంస్థ) కేవలం 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వరకు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. పరిపాలన వికేంద్రీకణ, అభివృద్ధి వికేంద్రీకరణ చట్టంలో భాగంగా అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. భూసమీకరణ పేరును కూడా మార్చుతున్నారు. ఇంతవరకు ఏపీసీఆర్డీఏకు ఉన్న అధికారాలు, విధులు, బాధ్యతలు అన్నీ ఏఎంఆర్డీఏకు బదిలీ అవుతాయని బిల్లులో పేర్కొన్నారు. సీఆర్డీఏ జారీ చేసిన బాండ్లు, చేసుకున్న ఒప్పందాలు కూడా కొత్త సంస్థ చేసుకున్నట్లుగా భావించాల్సి ఉంటుంది.