Water Man Of India on GO 111 Withdrawal : పచ్చదనాన్ని, పుడమితల్లిని, నీటిని కాపాడుతున్న జీవో 111ను రద్దు చేస్తే అది ప్రకృతి వినాశనానికి దారి తీస్తుందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ హెచ్చరించారు. అసెంబ్లీ సాక్షిగా ఈ జీవోను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై ఆయన స్పందించారు. ఇప్పటికే కాంక్రీట్ జంగల్‌గా మారిన హైదరాబాద్‌లో జీవో 111ను ఎత్తివేస్తే జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్‌లు కలుషితమవ్వడం ఖాయమని.. ఆ జలాశయాల పరిధిలో ఆవాసాలు వెలిసి మరో కాంక్రీట్ జంగల్ ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి వనరులు, చెరువులు, వాగులు, గుంటలతో కూడిన భూమి టైటిల్‌ని ఎవరూ మార్చలేరని.. దీనకిి సంబంధించి సుప్రీంకోర్టు 2001 జులై 6న తొలి తీర్పునిచ్చిందని రాజేంద్ర సింగ్ గుర్తు చేశారు. వీటితో ముడిపడిన వందల కేసులపై తీర్పునిచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో జీవో 111ను ఎత్తివేయడానికి కోర్టులు అనుమతించే ప్రసక్తే ఉందని అన్నారు.
Water Man Of India on GO 111 Cancelation : ఏళ్ల తరబడి భాగ్యనగర ప్రజల దాహార్తిని తీర్చిన జంట జలాశయాల నీటిని ఇప్పుడు వాడటం లేదంటూ జీవో 111ను ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం బాధాకరమని రాజేంద్ర సింగ్ ఆవేదన చెందారు. ఈ జీవోను రద్దు చేసే ఆలోచన మానుకోవాలని సూచించారు. ఈ జలాశయాల పరిధిలో ఉన్న 84 గ్రామాల్లోని ప్రజలను వేరే ప్రాంతానికి తరలించి వాటిని రక్షించాలని కోరారు.
సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా..
"కేసీఆర్ జీవో 111 రద్దు చేసి జలాశయాల ఉనికి లేకుండా చేస్తానంటున్నారు. ఈ విషయంపై నేను సుప్రీం కోర్టుకు వెళ్తాను. సుప్రీం తీర్పునే ఎదిరించాలని కేసీఆర్ చూస్తున్నారు. ఈ జీవోపై నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే ఎత్తివేస్తామని చెప్పారంటే.. ఆ కమిటీ ద్వారా తనకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకున్నట్లే కదా. కేసీఆర్ నిర్ణయమేంటో స్పష్టంగా అర్థమవుతోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల వల్లే జంట నగరాల అభివృద్ధి సాధ్యమైంది. భాగ్యనగరానికి అతి సమీపంలో ఉన్న వీటిని కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించగలుగుతాం."
- రాజేంద్ర సింగ్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా