ఏపీలోని పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు నిండుకుండలా పరవళ్లు తొక్కుతున్నాయి. పైనుంచి వస్తున్న వరదనీటిని ఎప్పటికప్పుడు అధికారులు దిగువకు వదులుతున్నారు. 7 లక్షల క్యూసెక్కుల మేర నీటిని దిగువకు పంపిస్తుండటంతో ఏపీలో కృష్ణా పరివాహక ప్రాంత గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లూరు, కొల్లిపొర, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో కృష్ణా నది ప్రవాహం సాగుతోంది. ఈ మండలాల పరిధిలో 20కి పైగా గ్రామాల్లో ప్రస్తుతం వరద పరిస్థితి తీవ్రంగా ఉంది.
వరదనీటితో భూమి ఎప్పటికప్పుడు కోతకు గురై ప్రవాహం పెరిగేకొద్దీ పొలాల్లోకి నీరు చేరుతోంది. పెసర, మినుము, మిరప, పసుపు, కంద పంటలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో పసుపుమొక్కలు వేర్లతో సహా పైకి తేలాయి. దీంతో పసుపు రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇవాళ, రేపు వరద మరింతగా పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
పంట నష్టం ఎంతంటే...?
కేవలం కృష్ణా జిల్లాల్లోనే వరదల కారణంగా ఇప్పటివరకూ 12,466 హెక్టార్ల పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. వీటిలో 5,243 హెక్టార్లలో వరి.. 5,547 హెక్టార్లలో పత్తి, 909 హెక్టార్లలో మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రభుత్వానికి నివేదిక అందించారు. అంతేకాకుండా సుమారు 1,410 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలైన మిర్చి, కూరగాయలు, పసుపు పంటలు ముంపునకు గురైనట్లు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల కల్వర్టులు అద్వాన్నస్థితికి చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 407 కిలోమీటర్ల మేర రహదారులు మరమ్మతుకు గురయ్యాయి. 21 చోట్ల కల్వర్టులు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటి పునరుద్ధరణ కోసం రూ.23.57 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
రక్షణ గోడ పనులకు ఆదేశం..
కొన్నిచోట్ల స్లూయిజ్ లకు రక్షణ గోడలు కట్టకపోవటం వల్ల వరదనీరు పొలాల్లోకి చేరుతోంది. ఈ స్లూయిజ్ లు ఉన్న ప్రాంతాల్లో పొలాలు ఉన్నంత వరకూ అడ్డుగోడలు కట్టాల్సిన అవసరం ఉందని రైతులు అంటున్నారు. అలా చేయకపోవటం వల్ల వందలాది ఎకరాలు మునిగిపోతున్నట్లు చెబుతున్నారు. కృష్ణానది ఒడ్డున 152.9 కోట్ల రూపాయలతో మంజూరైన రక్షణ గోడ పనులను వరద ప్రవాహం తగ్గిన వెంటనే చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.