ఏపీ విశాఖలోని రుషికొండ వద్ద పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న పనుల్లో తీర ప్రాంత క్రమబద్ధీకరణ మండలి (సీఆర్‌జడ్) నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. పరిమితికి మించి తవ్వేయడంతో తీర ప్రాంత సహజ వాతావరణం దెబ్బతింటోందని పలువురు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు సీఆర్‌జడ్ అనుమతులకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) దరఖాస్తు చేయగా కేంద్ర అటవీ పర్యావరణశాఖ గత ఏడాది మే 19న నిబంధనలతో కూడిన ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన నివేదికలోని అంశాలు బయటకు వచ్చాయి. ఆ అనుమతులకు భిన్నంగా క్షేత్ర స్థాయిలో పలు ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే కేంద్ర అటవీ శాఖకు వాస్తవ సమాచారం ఇవ్వలేదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
*మొత్తం 61 ఎకరాల రుషికొండ ‘హిల్ ఏరియా’లో 9.88 ఎకరాల్లో ప్రాజెక్టుకు ఏపీటీడీసీ అనుమతి తీసుకోగా... క్షేత్ర స్థాయిలో దీనికి రెండింతల తవ్వకాలు జరిగినట్లు కనిపిస్తోంది. కొండ మధ్యలో చిన్న భాగం తప్ప మిగిలిన అంతటా భారీగా తవ్వేశారు. శిఖర భాగాన్ని వదిలి చుట్టూ తవ్వకాలు జరిపారు. అటవీశాఖ 139 చెట్లు తొలగించినట్లు పేర్కొనగా... వందల సంఖ్యలో చెట్లను తొలగించినట్లు పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*సీఆర్‌జడ్ అనుమతుల్లో భాగంగా వీఎంఆర్‌డీఏ (విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ) పేర్కొన్న బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ప్లాన్) నిబంధనలు పాటించాలి. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేయడంలో కేంద్ర అటవీశాఖను తప్పుదోవ పట్టించినట్లు విమర్శలు వస్తున్నాయి. వివిధ రకాల అనుమతులకు మే నెలకు ముందే దరఖాస్తు చేసి ఆగస్టులో పనులు మొదలుపెట్టారు. అప్పటికి ‘2041 మాస్టర్ ప్లాన్’ అమల్లోకి రాకపోవడంతో 2021 ప్లాన్‌ను ప్రాతిపదికగా తీసుకోవాలి. దీని ప్రకారం ఈ ప్రాంతం అటవీ సంరక్షణ పరిధిలోని సీఆర్‌జడ్ -1లో ఉంది. అంటే ఇక్కడ నిర్మాణాలకు వీలు కాదు. ఈ నేపథ్యంలో అమలులోకి రాని ‘2041 మాస్టర్‌ప్లాన్’ ప్రకారం నిర్మాణాలకు వీలయ్యే సీఆర్‌జడ్-2 పరిధిలో చూపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నూతన ప్రణాళిక నవంబరు నుంచి అమల్లోకి వచ్చింది.
సముద్ర తీరం కలుషితం
రుషికొండ వద్ద తవ్విన మట్టిని సముద్ర తీరంలో పలు చోట్ల డంపింగ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం తవ్వకాల ద్వారా వచ్చిన వాటిని నీటి వనరులు, పక్కనే ఉన్న ప్రదేశాల్లో వేయకూడదు. ప్రాజెక్టు పూర్తయ్యాక అంతకు ముందున్నట్లుగా ఆయా ప్రాంతాలు పునరుద్ధరించాలి. దీనికి విరుద్ధంగా వేలాది టన్నుల గ్రావెల్‌ను సముద్ర తీరంలో పారబోశారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పేరుతో తీర ప్రాంత సహజత్వాన్ని పూర్తిగా దెబ్బతీశారు. లారీల్లో మట్టిని తరలించి చేపల తిమ్మాపురం నుంచి ఎర్రమట్టి దిబ్బల వరకు సుమారు పది కిలోమీటర్ల మేర తీరం వెంట పోశారు. చాలాచోట్ల పది అడుగుల ఎత్తు వరకు మట్టి వేసి చదును చేశారు. మంగమారిపేట, మరికొన్ని చోట్ల ఈ మట్టి ఏకంగా సముద్రంలోకి జారిపోతుంది. దీనివల్ల ఇసుక తిన్నెలు సహజ వాతావరణానికి ముప్పు ఏర్పడుతోంది. సాగర జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని పర్యావరణవేత్తలు, మత్స్యసంపదపైనా ప్రభావం ఉంటుందని స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
*నిర్మాణాలు చేపడుతున్న గుత్తేదారు లేబర్ క్యాంపు ఏర్పాటు చేయడమే కాకుండా పెద్ద సంఖ్యలోని లారీలు, ఇతర యంత్రాలను అక్కడే ఉంచుతున్నారు. ఈ పనుల ప్రగతి నివేదికను ఏపీటీడీసీ వెబ్‌సైట్‌లో నిర్ణీత కాలంలో ఉంచాల్సినప్పటికీ పెట్టలేదు. ‘సీఆర్‌జడ్ నిబంధనల మేరకే పనులు చేస్తున్నాం. ఎక్కడా మీరడం లేదు. వాహనాలు తిరగడానికి వీలుగా పనులు చేయడంతో ఎక్కువ విస్తీర్ణంలా కనిపిస్తుంది. ల్యాండ్ స్కేపింగ్ వంటి పనులు చేసి ప్రాజెక్టు 9.88 ఎకరాల్లోకే పరిమితం చేస్తాం. మిగిలిన ప్రాంతాన్ని కొండలా మారుస్తాం. పర్యాటక శాఖ అవసరాల నిమిత్తం కొన్ని చోట్ల గ్రావెల్ డంపింగ్ చేశాం’ అని ఓ అధికారి పేర్కొన్నారు.
కోర్టు ధిక్కరణ కింద