తెలంగాణ

telangana

ETV Bharat / city

వెజిటెబుల్​ బిర్యానీ కొంటే.. నంజుకోడానికి బొద్దింకలు ఫ్రీ.. ఎక్కడంటే..?

రోజూలాగే ఆ వ్యక్తి తనకిష్టమైన హోటల్​కు వెళ్లాడు. ఎప్పటిలాగే అల్పాహారం పార్శిల్​ తీసుకున్నాడు. ఇంటికి వెళ్లి.. తిందామని ఆ పార్శిల్​ తెరిచి చూసి.. అవాక్కయ్యాడు. ఎందుకంటే.. అతడు ఆర్డరిచ్చింది వెజిటెబుల్​ బిర్యానీ అయితే.. అందులో నంజుకోడానికి ఉడకబెట్టిన బొద్దింకలు కూడా ఉచితం ఇచ్చారు. ఇలా కూడా ఇస్తారా అని నోరెళ్లబెట్టకండి.. ఈ వార్త పూర్తిగా చదివేయండి..

vegetable-biryani-with-cockroach-garnish-in-chikkadapally-hotel
vegetable-biryani-with-cockroach-garnish-in-chikkadapally-hotel

By

Published : Oct 28, 2021, 7:06 PM IST

వెజిటెబుల్​ బిర్యానీ కొంటే.. నంజుకోడానికి బొద్దింకలు ఫ్రీ.. ఎక్కడంటే..?

హైదరాబాద్​లోని చిక్కడపల్లికి చెందిన గణపతిశాస్త్రి.. వృత్తిరిత్యా పురోహితుడు. శాకాహారం మాత్రమే తింటాడు. వండుకోవటం సాధ్యపడనప్పుడు, వృత్తిపరంగా ఇంట్లో తినటం వీలుకానప్పుడు.. మాత్రం హోటల్లో తినటం గణపతిశాస్త్రికి అలవాటు. అయితే.. ఏ హోటల్లో పడితే ఆ హోటల్లో తినడు. పూర్తిగా శాకాహారం మాత్రమే లభిస్తుందన్న నమ్మకముంటేనే.. అందులో తింటాడు. గణపతిశాస్త్రికి అలాంటి పూర్తి నమ్మకమున్న హోటలే.. చిక్కడపల్లి మెయిన్​రోడ్డులో ఉన్న నందిని సుధా హోటల్​. ఇలా పూర్తి విశ్వసమున్న హోటల్​ కావటం వల్ల.. నిత్యం అందులోనే అల్పాహారం తీసుకుంటాడు.

పార్శిల్​ తెరిచి కంగుతిన్నాడు..

రోజూలాగే ఈరోజు కూడా.. గణపతిశాస్త్రి హోటల్​కు వెళ్లాడు. వెజిటేబుల్​ బిర్యానీ కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి.. తిందామని పార్శిల్​ తెరిచి చూసిన గణపతిశాస్త్రి.. కంగుతిన్నాడు. వెజిటేబుల్​కు బదులు పార్శిల్​లో బొద్దింక బిర్యానీ ఉంది. అదేనండీ.. బిర్యానీలో బొద్దింక దర్శనమిచ్చింది. పార్శిల్​ చేసేటప్పుడు పడిందా అంటే.. అది కూడా కాదు.. ఆ బొద్దింక ఉడకిపోయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. దాని అవశేషాలు చూసి అవాక్కయిన గణపతిశాస్త్రి.. పార్శిల్​ పట్టుకుని నేరుగా హోటల్​కు వెళ్లాడు.

యాజమాన్యం నిర్లక్ష్యంతో కోపం..

హోటల్​ నిర్వహకులకు విషయం వివరించాడు. ఇలా ఎలా చేస్తారని.. ప్రశ్నించాడు. దానికి అటు నుంచి నిర్లక్ష్యమైన సమాధానం ఎదురైంది. వారి నిర్లక్ష్యాన్ని సహించలేని గణపతిశాస్త్రి.. వారికి సరైన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే జీహెచ్​ఎంసీ సర్కిల్​ 15 ఏఎమ్​హెచ్​ఓకు, చిక్కడపల్లి పోలీస్​స్టేషన్​లో ఇదే విషయంపై ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన.. జీహెచ్​ఎంసీ ఎన్​ఫోర్స్​మెంట్​ సిబ్బంది హోటల్​కు చేరుకుని.. వంటశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

నిర్లక్ష్యానికి జరిమానా..

కిచెన్​లో మురిగిపోయిన క్యారెట్​తో పాటు ఇతర పదార్థాలను చూసి జీహెచ్​ఎంసీ సిబ్బంది నివ్వెరపోయారు. వెంటనే ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేశారు. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి గానూ అధికారులు మొదటిసారి కాబట్టి... రూ. 5 వేల జరిమానా విధించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ప్రభుత్వపరంగా కఠినచర్యలు తీసుకుంటామని హోటల్ నిర్వాహకులను హెచ్చరించారు.

యాజమాన్యానికి జరిమానా

నమ్మకాన్ని వమ్ము చేశారు..

"పూర్తి శాకాహారినైన నేను ఎంతో నమ్మకం పెట్టుకుని ఈ హోటల్​కు రోజూ వస్తుంటాను. ఇవాళ మాత్రం వెజ్​బిర్యానీ కొనుగోలు చేస్తే.. బొద్దింక బిర్యానీ ఇచ్చి నిర్వాహకులు నా నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. ఇదే విషయమై అడిగితే.. నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చి.. మరింత ఆగ్రహం తెప్పించారు. తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండాలి. ఒకవేళ తప్పు జరిగితే.. అందుకు సరైన స్పందన ఇవ్వాలి. అలా కాకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. వినియోగదారులను కించపర్చటం సరైన పద్ధతి కాదు. ఈ హోటల్​ యాజమాన్య నిర్లక్ష్యంపై సదరు శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి."-గణపతిశాస్త్రి, వినియోగదారుడు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details