'పోలవరం వల్ల లక్ష ఎకరాల వరకు మునిగిపోతాయి..' Rajathkumar On Polavaram: పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల విషయంలో అధ్యయనం చేసేందుకు కేంద్రానికి ఎన్నోసార్లు నివేదించామని... దాంతో పాటు ఇతరత్రా అంశాలపై ఇప్పటికీ స్పందనలేదని జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని జలసౌధలో ఎస్‌ఆర్‌ఎస్పీ, కడెం, కాళేశ్వరం ప్రాజెక్టులు, భద్రాచలంకు వాటిల్లే ముప్పు, భద్రతా అంశాలపై రజత్‌కుమార్ సమీక్షించారు. పోలవరం బ్యాక్‌వాటర్ కారణంగా లక్ష ఎకరాల పంట నష్టంతోపాటు చారిత్రాత్మక ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుందని రజత్‌కుమార్ తెలిపారు. భద్రాచలం, పర్ణశాల వంటివి మునిగిపోతాయని పేర్కొన్నారు.
కడెం ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. గడిచిన వందేళ్లలో లేని విధంగా కడెం ప్రాజెక్టు ఎగువ కురిసిన వర్షాల కారణంగా కొంత వరకు నష్టం జరిగిందని.. మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. పరివాహక ప్రాంతం ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు మండలాల్లో 300మి.మీ వర్షం కురిసిందన్నారు. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా క్లౌడ్ బరస్ట్ లాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని రజత్‌కుమార్ వివరించారు. వరదలు వర్షాలపై ప్రభుత్వం సంసిద్దంగా లేదనడం సరికాదన్నారు. వరద నష్టం అంచనాలపై మీడియాలో వస్తున్న కథనాలన్నీ నిరాధారమేనని కొట్టిపారేశారు.
భారత వాతావరణశాఖ డేటా యూరోపియన్ శాటిలైట్ ఏజెన్సీల నుంచి కూడా వర్షపాత తీవ్రతపై సరైన సమాచారం అందలేదని.. అవి కూడా పరిస్థితిని కచ్చితంగా అంచనా వేయలేకపోయాయని తెలిపారు. కాళేశ్వరం నిర్మాణం విషయంలో కొంతమంది చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. కేంద్రంలోని సీడబ్ల్యూసిలోని 18 విభాగాల అనుమతి తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. భారీ వరదల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు సుమారు 20 నుంచి 25కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. అగ్రిమెంట్లో పేర్కొన్న విధంగా ఆ నష్టాన్ని నిర్వహణా సంస్థలే భరిస్తాయని ప్రభుత్వానికి సంబంధంలేదని స్పష్టం చేశారు. మరో 45 రోజుల్లో కాళేశ్వరం పంప్‌హౌజ్‌ల మరమ్మతు పనులు పూర్తవుతాయని రజత్‌కుమార్ వివరించారు.
"పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో స్టడీ చేసేందుకు కేంద్రానికి ఎన్నోసార్లు నివేదించాం. అయినా.. కేంద్రం ఇప్పటికీ స్పందించలేదు. బ్యాక్ వాటర్ వల్ల పంట నష్టంతో పాటు చారిత్రాత్మక ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుంది. భద్రాచలం, పర్ణశాల వంటివి మునిగిపోతాయి. పోలవరంతో లక్ష ఎకరాల వరకు మునిగిపోతాయి. జలవనరుల శాఖలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగం ఏర్పాటు చేసి కడెం ప్రాజెక్టుకు ఇటీవలే మరమ్మత్తులు చేసినందున ఎలాంటి ప్రమాదం జరుగలేదు. కేంద్రంలోని సీడబ్ల్యూసీలోని 18 విభాగాల అనుమతి తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. భారీ వరదల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు 20 నుంచి 25కోట్ల మేర నష్టం జరిగింది. అగ్రిమెంట్లో పేర్కొన్న విధంగా ఆ నష్టాన్ని నిర్వహణా సంస్థలే భరిస్తాయి. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు." - రజత్‌కుమార్, జల వనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ఇవీ చూడండి: