కరోనా యుద్ధంలో మనం విజయం సాధిస్తామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జనతా కర్ఫ్యూ స్ఫూర్తినే కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. కేసులు సున్నా అయ్యేవరకు అదే స్ఫూర్తితో ఉండాలని సూచించారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి లాక్‌డౌన్ ప్రకటించాయని... ప్రజలు రోడ్లపై పెద్దఎత్తున గుమిగూడి పోలీసులతో వాదించడం సరికాదని హితవు పలికారు. ప్రతి వ్యక్తి ఆదర్శంగా ఉండేలా వ్యవహరించాలని కోరారు.
నిన్నటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా సోకింది. ఇప్పుడు వారి నుంచి ఇతరులకు కరోనా సోకుతోంది. కరోనా విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఇప్పటివరకు 492 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోలుకున్న 37 మందిని డిశ్చార్జి చేశాం. విమానాశ్రయాల్లో 15.24 లక్షల మందికి స్క్రీనింగ్ చేశాం. 436 మందిని ఇళ్లలోనే ఉంచి చికిత్స చేయిస్తున్నాం. 118 టెస్టింగ్ ల్యాబ్‌లను పెంచాం. 94,963 క్వారంటైన్ బెడ్స్ సిద్ధం చేశాం. ప్రతిరోజూ 20 వేలమందిని పరీక్షించే అవకాశం ఉంది.