Union Budget For Greater Hyderabad : మురుగునీటి శుద్ధి, వరద నాలాల అభివృద్ధి, ప్రజా రవాణాను పట్టాలెక్కించే ఎంఆర్‌టీఎస్, వాహనాలను పరుగు తీయించే పైవంతెనలు, ఆకాశ మార్గాల వంటి ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ వంటి సంస్థలు ఆయా ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నాయి. ప్రస్తుతం ఆర్థికంగా ఆయా సంస్థలు ఇబ్బందిపడుతున్నాయి. కొవిడ్ వ్యాప్తితో జీహెచ్‌ఎంసీ సైతం రెండేళ్లుగా ఆదాయ వనరులను పెంచుకోలేక పోయింది. భూముల వేలం, ఇతరత్రా చర్యలతో హెచ్‌ఎండీఏకు కొంత మేర నిధులు సమకూరినా.. నిర్వర్తించాల్సిన పనుల వ్యయం దానికి చాలా రెట్లు ఎక్కువగా ఉంది. గడ్డు పరిస్థితుల నుంచి మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులు గట్టెక్కాలంటే.. కేంద్రం చేయూతనివ్వాల్సిందే అనే మాట వినిపిస్తోంది. మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే పద్దులో చేయూత లభిస్తుందని నగరం ఆశగా చూస్తోంది.
పైవంతెనల ఎస్సార్డీపీ..
Union Budget For Hyderabad Flyovers : రూ.30వేల కోట్ల అంచనా వ్యయంతో రాజధానిలో పై వంతెనలు, అండర్ పాస్‌లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు ఐదేళ్ల కిందట వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని(ఎస్సార్డీపీ) ప్రారంభించారు. నగరానికి తూర్పు, పశ్చిమాన ఉన్న ప్రాంతాలను కలుపుతూ మూసీ నది వెంట ఆకాశ మార్గాల నిర్మాణం, ఇతర పనులకు రూ.11,500 కోట్లతో అంచనాలు రూపుదిద్దుకున్నాయి. పర్యావరణ అనుమతులు, నిధుల్లేక పనులు ముందుకు పడట్లేదు.
దూరాలను కలిపే లింకు రోడ్లు
Union Budget for Link Roads in Hyderabad : నగర వ్యాప్తంగా రాకపోకలను సులభతరం చేసేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ రహదారుల అభివృద్ధి సంస్థ(హెచ్‌ఆర్‌డీసీఎల్) ఏర్పాటైంది. దీని ఆధ్వర్యంలో ఇప్పటికే రెండు దశల లింకు రోడ్ల పనులు పురోగతిలో ఉండగా, ఇటీవల మూడో దశ ప్రతిపాదనలూ సిద్ధమయ్యాయి. ఐటీ కారిడార్‌తో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలు, శివారులోనూ రహదారులను ఓఆర్‌ఆర్ వరకు విస్తరించే పనులు మొదలయ్యాయి. గుర్తించిన 104 అదనపు కారిడార్లను రూ. 2400కోట్లతో అభివృద్ధి చేయనున్నామని, లింకు రోడ్లు, కనెక్టింగ్ కారిడార్ల కోసం కేంద్రం ప్రాజెక్టులో వ్యయంలో 25శాతం(రూ.800కోట్లు) భారాన్ని కేంద్రం మోయాలనేది రాష్ట్ర సర్కారు మాట.
ఎంఆర్‌టీఎస్ రోడ్డెక్కాలంటే..
Union Budget For MRTS in Hyderabad : కోకాపేట చుట్టుపక్కల ప్రాంతాలు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్‌గా(సీబీడీ)గా మారనున్నాయని సర్కారు చెబుతోంది. వచ్చే ఐదేళ్లలో 5లక్షల మంది ఉద్యోగులు అక్కడ పనిచేయనున్నారు. వారి రవాణా అవసరాలు తీర్చేందుకు కేపీహెచ్‌బీ-కోకాపేట-నార్సింగిని కలుపుతూ ఎంఆర్‌టీఎస్(మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్) వ్యవస్థ తీసుకురావాలని సర్కారు నిర్ణయించింది. అందుకు రూ.3,050కోట్లు అవసరం. 62 మురుగు నీటి శుద్ధి కేంద్రాలు, మురుగు నీటి మెయిన్ల నిర్మాణానికి రూ.8684.54 కోట్లు ఖర్చు కానున్నాయి. ప్యారడైజ్ కూడలి నుంచి కండ్లకోయ, జేబీఎస్ నుంచి తూముకుంట మీదుగా ఓఆర్‌ఆర్ వరకు నిర్మించతలపెట్టిన రెండు భారీ పైవంతెనలకు రక్షణ శాఖ భూములు ఇవ్వాలని, కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్ల సమస్యకూ కేంద్రం పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఆయా అంశాలతో పాటు వేర్వేరు ప్రాజెక్టుల అమలుకు.. కేంద్ర పద్దులో రూ.6వేల కోట్లకుపైగా నిధులు కేటాయించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.