తెలంగాణ

telangana

ETV Bharat / city

ఒక్కొక్కరికి 2 డోసులు... దుష్ఫలితాల కట్టడికి మూడంచెల ఏర్పాట్లు - కరోనా వైరస్​ వార్తలు

ఒక్కొక్కరికి రెండు డోసుల కొవిడ్​ టీకాను అందజేయనున్నారు. దుష్ఫలితాల పర్యవేక్షణకు ప్రతి టీకా పంపిణీ కేంద్రంలోను నోడల్‌ అధికారిని నియమించింది. అత్యవసర తరలింపునకు 1000 అంబులెన్సులను సిద్ధం చేసుకున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

covid vaccine
covid vaccine

By

Published : Jan 9, 2021, 6:48 AM IST

అర్హులైన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఒక డోసులో 0.5 మి.లీ. వంతున కొవిడ్‌ టీకాను అందజేయనున్నారు. ప్రతి లబ్ధిదారుడికి ఈ టీకాను 28 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఇస్తారు. అంటే మొదటి డోసు తీసుకున్న నాలుగు వారాలకు అదే టీకాను అంతే డోసులో రెండోసారీ తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. ద్రవరూప కొవిడ్‌ టీకాను సూదిమందు(ఇంజక్షన్‌) ద్వారా అందజేస్తారు. వ్యాక్సిన్‌ను 2-8 డిగ్రీల ఉష్ణోగ్రతలో, అత్యంత శుభ్రమైన, సురక్షితమైన ప్రదేశాల్లోనే భద్రపర్చాలని, ఎండలో ఉంచనేవద్దని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

సత్వర చికిత్సకు కిట్​

టీకా కేంద్రాలన్నీ అత్యంత పరిశుభ్రంగా ఉంచాలని ఆరోగ్యశాఖ సూచించింది. టీకాల పంపిణీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని జిల్లాల వైద్యాధికారులకు తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. కొవిడ్‌ టీకా ఎంతో సురక్షితమైనదని, అర్హులంతా తప్పక తీసుకోవాలని పేర్కొంది. దుష్ఫలితాల (సైడ్‌ ఎఫెక్ట్స్‌) పర్యవేక్షణకు ప్రతి టీకా పంపిణీ కేంద్రంలోను నోడల్‌ అధికారిని నియమించింది. దుష్ఫలితాలు తలెత్తితే సత్వర చికిత్సకు 14 రకాల మందులు, వస్తువులతో కూడిన కిట్‌ను అందుబాటులో ఉంచనుంది.

దుష్ఫలితాలొస్తే...

దుష్ఫలితాలను ఆరోగ్యశాఖ మూడు రకాలుగా విభజించింది.

1. టీకా వేశాక నొప్పి, వాపు, జ్వరం వంటివి రావడం.

2. గుండె వేగంగా కొట్టుకోవడం, బీపీ పడిపోవడం, ఆయాసం వంటివి

3. ఉన్నట్టుండి పరిస్థితి విషమించడం, అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్పించాల్సి రావడం

దుష్ఫలితాలకు అక్కడికక్కడే చికిత్స

టీకా పొందే వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సత్వర వైద్యమందించేలా సన్నద్ధమవ్వాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది. దుష్ఫలితాల సమాచారాన్ని వెంటనే కొవిన్‌ యాప్‌లో పొందుపర్చాలని సూచించింది. సాధారణ, కొద్దిగా తీవ్రమైన దుష్ఫలితాలకు అక్కడికక్కడే చికిత్స అందించేలా వైద్యులు, నర్సులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. పరిస్థితి విషమిస్తున్నట్లు భావిస్తే.. సత్వరమే సమీపంలోని పెద్దాసుపత్రికి తరలించేందుకు అంబులెన్సులను సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రతి టీకా పంపిణీ కేంద్రానికి అనుసంధానంగా ఇప్పటికే కొన్ని జిల్లా, బోధనాసుపత్రులను ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 64 ఆసుపత్రులను సర్కారు ఎంపిక చేసింది.

తొలిదశలో 75 లక్షల మందికి

రాష్ట్రంలో తొలిదశలో 75 లక్షల మందికి టీకాలందించడానికి 10వేల టీకాల పంపిణీ కేంద్రాలను నెలకొల్పాలని వైద్యఆరోగ్యశాఖ భావించింది. వీరిలో ముందుగా వైద్యసిబ్బందికి 2 వారాల పాటు, తర్వాత పోలీసు, పురపాలక, రెవెన్యూ సిబ్బందికి ఇవ్వాలని నిర్ణయించింది. ఆ దిశగా ముందుగా 1500 టీకా పంపిణీ కేంద్రాలనే ఏర్పాటు చేయనుంది. దుష్ఫలితాలు తలెత్తితే అత్యవసరంగా తీసుకెళ్లడానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి సుమారు 1000 అంబులెన్సులను సిద్ధం చేసుకున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

పరిశీలనకు ప్రాధాన్యం

  • ప్రతి టీకా కేంద్రంలోనూ వేచి చూడడానికి, టీకా తీసుకోవడానికి, పరిశీలనకు.. మూడు గదులు ఏర్పాటు చేయాలి.
  • ప్రతి కేంద్రానికి ఒక నోడల్‌ అధికారి, ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఉంటుంది.
  • టీకా లబ్ధిదారుల సమాచార సేకరణకు ఎంత ప్రాధాన్యముంటుందో.. టీకా తీసుకున్నాక వారి ఆరోగ్యస్థితిని పరిశీలించడానికి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యముంటుంది.
  • అరగంట పాటు టీకా లబ్ధిదారుడి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి.
  • ప్రభుత్వఆసుపత్రులతో పాటు 100 మందికి పైగా సిబ్బంది ఉండే ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ టీకా కేంద్రాలను నెలకొల్పుతారు.

ఇదీ చదవండి :నేడు జంట నగరాల్లో మంత్రి కేటీఆర్​ పర్యటన

ABOUT THE AUTHOR

...view details