Paddy Procurement in Telangana : ధాన్యం కొనుగోలుపై తెరాస-భాజపా మధ్య నువ్వానేనా అన్నట్లుగా సాగుతున్న మాటల యుద్ధంలోకి కాంగ్రెస్ ప్రవేశించింది. రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ట్విటర్‌లో స్పందించారు. వడ్ల కొనుగోలులో భాజపా, తెరాస ప్రభుత్వాల వైఖరి దారుణంగా ఉందని మండిపడ్డారు. ధాన్యం సేకరణను కేంద్రం, రాష్ట్రం రాజకీయం చేస్తున్నాయన్న రాహుల్ గాంధీ.. రైతులను ఇబ్బంది పెట్టడం ఆపాలని.. ప్రతి ధాన్యం గింజ కొనాలని డిమాండ్ చేశారు. ధాన్యం పూర్తిగా కొనే వరకు తెలంగాణ రైతుల తరఫున కాంగ్రెస్ పోరాటం చేస్తుందని రాహుల్ స్పష్టం చేశారు.
TRS Congress Twitter War : రాహుల్ ట్వీట్‌పై ఐటీ మంత్రి కె.తారకరామారావు ఘాటుగా స్పందించారు. 50 ఏళ్లు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ రైతులకు కనీసం ఆరుగంటలు కరెంట్ ఇవ్వలేకపోయిందని విమర్శించారు. తెలంగాణలో రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను సీఎం కేసీఅర్ తెచ్చారని.. సాగుకి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి విప్లవం తీసుకొచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. పనితీరులో తమ ప్రభుత్వం కాంగ్రెస్ కన్నా మెరుగ్గా రాణించిందన్నారు. దశాబ్దాలుగా రైతులను విస్మరించిన కాంగ్రెస్ తొలుత కర్షకులకు క్షమాపణ చెప్పాలని కోరారు. విమర్శలు మానుకొని ధాన్యం కొనుగోలు చేయబోమని మొండికేస్తున్న దిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రాహుల్‌ను కేటీఆర్ కోరారు.
KTR Tweet to Rahul Gandhi : కేటీఆర్ ట్వీట్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టిగా బదులిచ్చారు. తెరాస ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడటం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతుల ఆవేదనను అర్థం చేసుకుని ఉద్యమ కార్యచరణకు మద్ధతుగా నిలిచిన రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.