ఏపీ కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదీ తీరంలో మొత్తం 21 ఘాట్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవిగాక పాత ఘాట్లు మరికొన్ని ఉన్నాయి. ఒక్కో ఘాట్ వద్ద 2008 పుష్కరాలకు 20 మంది పురోహితులకు అనుమతిచ్చారు. ఈ నెలలో జరిగే పుష్కరాలకు ఒక్కో ఘాట్‌కు 15 మందికి అనుమతిచ్చి గుర్తింపు కార్డులు ఇచ్చేలా జిల్లా సర్వోన్నతాధికారి వీరపాండియన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. గుర్తింపు కార్డుల కోసం తెలంగాణ నుంచి 30 మంది, ఆంధ్రప్రదేశ్‌లోని 340 మంది దరఖాస్తు చేసుకున్నట్లు దేవాదాయశాఖ కమిషనర్ ఆదిశేషనాయుడు తెలిపారు.
పుష్కరాల్లో వేద పండితులతో యాగశాలలో హోమం చేయించేందుకు దేవాదాయశాఖ నిర్ణయించింది. ఇప్పటికే హోమాలకు సంబంధించి పూజా సామగ్రికి టెండర్లు పూర్తయ్యాయి. అలాగే యాగశాలను నిర్మించడానికి ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వెదురు కర్రలతో చేపట్టే ఈ నిర్మాణానికి ఈ నెల 11న కొటేషన్లకు గడువు తేదీగా ప్రకటించారు. ఇది సంకల్‌బాగ్ ఘాట్ వద్ద నిర్మించాలన్న ఆలోచనలో అధికారులున్నారు. యాగశాలలో 12 మంది వేద పండితులు పాల్గొంటారు. హోమాలు చేశాక సాయంత్ర వేళల్లో హారతులిచ్చే కార్యక్రమంలో వీరు పాల్గొంటారు. పుష్కరాల్లో చివరి రోజున పుర్ణాహుతికి ఏర్పాటు చేస్తున్నారు.