తితిదే పరిధిలోని కొన్ని ఆలయాల్లో రథాలకు తగినంత భద్రత లేదు. కొన్ని ఆలయాలల్లో రథాలను జాగ్రత్తపరుచుటకు తగిన ఏర్పాట్లు లేవు. అందుకే తితిదే అధికారులు సమావేశం నిర్వహించారు.
అంతర్వేది శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయ రథం దగ్ధం ఘటన తర్వాత... తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, విగ్రహాలు, రథాల ధ్వంసం వంటి ఘటనలతో తితిదే పరిధిలోని ఆలయాల భద్రతపై... సమీక్ష నిర్వహించారు. తిరుమల ఆయలంతో పాటు తితిదే పరిధిలో ఉన్న ఆలయాల రథాల భద్రతకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయ రథం బహిరంగ ప్రదేశంలో ఉండటంతోపాటు..చిన్నపాటి ప్లాస్టిక్ కాగితాలతో కప్పి ఉంచుతున్నారు. ఈ రథానికి భద్రత కల్పించడానికి చర్యలు చేపట్టారు. చుట్టు ఇనుప స్థంభాలతో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
'అంతర్వేది ఘటన తర్వాత అప్రమత్తమైన తితిదే అధికారులు' తగినంత స్థాయిలో లేని భద్రత..
తితిదే పరిధిలో తిరుచానూరు పద్మావతి అమ్మవారు, శ్రీనివాసమంగాపురం కళ్యాణవెంకటేశ్వర స్వామి, తిరుపతి గోవిందరాజస్వామి, కోదండరామస్వామి, ఒంటిమిట్ట రామాలయంతోపాటు 19 ఆలయాలు ఉన్నాయి. ఈ 19ఆలయాల రథాలకు కొన్నింటికి తగినంత స్థాయిలో భద్రత లేదని హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగిన తితిదే పరిధిలోని ఆలయాల్లో... కొన్నిచోట్ల రథాలను తాత్కాలిక షెడ్లలో ఉంచడాన్ని తప్పుపడుతున్నారు. అంతర్వేది ఘటన దృష్ట్యా మేల్కోవాలని కోరుతున్నారు.
ఇప్పటికే రథ మండపాలు ఉన్న ఆలయాల్లో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకొంటున్న తితిదే... సీసీ కెమెరాల నిఘా లేని ప్రాంతాల్లో కొత్త కెమెరాలు ఏర్పాటు చేస్తోంది.
ఇదీ చూడండి.అంతర్వేది దేవస్థానానికి ప్రత్యేక అధికారి నియామకం