corporations loans in Telangana govt: వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపు విధానాల్లో రాష్ట్రప్రభుత్వం మార్పులు చేస్తోంది. కార్పొరేషన్ల అప్పులకు సంబంధించిన చెల్లింపులను బడ్జెట్ ద్వారా చేయడంపై కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలే అందుకు కారణం. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపులను బడ్జెట్ ద్వారా చేస్తే వాటిని ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి రాష్ట్రప్రభుత్వం తీసుకునే అప్పులుగా పరిగణిస్తామని కేంద్రం స్పష్టంచేసింది. ఆ మేరకు గత రెండు ఆర్థికసంవత్సరాల్లో తీసుకున్న రుణాలను ఎఫ్ఆర్బీఎం కిందే పరిగణించి ఇక నుంచి బాండ్ల జారీ ద్వారా తీసుకునే అప్పుల్లో ఆ మేరకు కోత విధించింది.
రుణాల చెల్లింపులో మార్పులు: రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కోత మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగేళ్లకు విభజించారు. తద్వారా ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి బాండ్లజారీ ద్వారా తీసుకునే రుణాల మొత్తంలో 15వేల కోట్ల మేర తగ్గింది. ఇక వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. తద్వారా వాటిపై ఆధారపడి చేపట్టిన కార్యక్రమాలు, పనులు అర్థాంతరంగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపు విధానాల్లో మార్పులు చేస్తోంది.
బడ్జెట్ నుంచి నేరుగా నిధులివ్వకుండా చెల్లింపులు: రుణాలు తీసుకుంటున్న ఆయాకార్పొరేషన్లకు ఆదాయ మార్గాలు ఉండాలని అందులో నుంచే చెల్లింపులు చేయాలని కేంద్రప్రభుత్వం చెబుతోంది. అందుకు అనుగుణంగానే చెల్లింపులు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బడ్జెట్ నుంచి నేరుగా నిధులివ్వకుండా చెల్లింపులు జరిగేలా జాగ్రత్తలు తీసుకునే పనిలో నిమగ్నమైంది. కాళేశ్వరంప్రాజెక్టును సాగు,తాగునీటితోపాటు పారిశ్రామికఅవసరాలకు వినియోగిస్తున్నారు. ఆ నీరు వినియోగించుకున్న ఆయా సంస్థలు, శాఖల నుంచి కార్పొరేషన్‌కు ఆదాయం సర్దుబాటు చేసేలా చేస్తున్నారు. ఆ మొత్తం నుంచి అప్పులకు సంబంధించిన చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకోనున్నారు.