తెలంగాణ

telangana

ETV Bharat / city

'విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెద్దాం'

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా.. పార్లమెంటు సమావేశాల్లో గళమెత్తాలని పార్టీ ఎంపీలకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రావల్సిన నిధులు, విభజన హామీల అమలుపై లేవనెత్తాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. తొలిసారిగా తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం కేటీఆర్ అధ్యక్షతన జరిగింది. శీతాకాలం సమావేశాల్లో అంశాల వారీ వైఖరి అనుసరించాలని తెరాస నిర్ణయించింది.

ktr

By

Published : Nov 15, 2019, 10:43 PM IST

విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడితెద్దాం...

పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో అంశాల వారీగా వ్యవహరించాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది.తెలంగాణ భవన్​లో జరిగిన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తొలిసారిగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అధ్యక్షత వహించారు. లోక్​సభ, రాజ్యసభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తెరాస ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి రావల్సిన నిధులు, విభజన హామీల అమలు కోసం రానున్న పార్లమెంటు సమావేశాల్లో గళమెత్తాలని కేటీఆర్ స్పష్టం చేశారు.

సభలో లేవనెత్తే అంశాలు

  1. విభజన హామీలు, కేంద్రం వద్ద పెండింగ్​లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వినతులు
  2. ఐఐఎం వంటి విద్యాసంస్థలు, బయ్యారం ఉక్కు కర్మాగార ఏర్పాటు వంటి విభజన హమీలు
  3. మిషన్ భగీరథకు కేంద్ర నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా
  4. హైదరాబాద్​లో రహదారుల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూముల బదలాయింపు, ఫార్మా సిటీకి నిమ్జ్ హోదా
  5. రాష్ట్రానికి దక్కాల్సిన ప్రాజెక్టులు, నిధులు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి దీర్ఘకాలిక డిమాండ్లు
  6. తమ నియోజకవర్గాల్లోని దీర్ఘకాలిక డిమాండ్లు

కేంద్రంపై అసంతృప్తి

ఐదేళ్లుగా అనేక అంశాలపై కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసినప్పటికీ.. స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం హామీ ఇచ్చిన పలు అంశాలు కూడా అమలు చేయడం లేదని.. వాటిని దిల్లీలో ఫాలో అప్ చేయాలన్నారు. శాఖల వారీగా తెలంగాణ డిమాండ్లు, వినతుల జాబితా ఎంపీలకు ఇస్తామని పేర్కొన్నారు. పలు స్టాండింగ్ కమీటీల్లో సభ్యులుగా ఉన్న ఎంపీలు... ఆయా శాఖల్లో ఉన్న పథకాలను, ప్రయోజనాలను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని సూచించారు.

అన్ని హంగులతో దిల్లిలో కార్యాలయం

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గణాంకాలను ఎంపీలకు అందుబాటులో ఉంచేందుకు అన్ని హంగులతో కూడిన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దిల్లీలో తెరాస కార్యాలయ నిర్మాణ ప్రక్రియను ప్రారంభిస్తామని, ఈ విషయంలో పార్టీ ఎంపీలు చురుగ్గా దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్, సంతోష్ కుమార్ మినహా మిగతా లోక్​సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: సెలవుల్లో టీచర్​.. సఫాయి కూతురే పంతులమ్మ

ABOUT THE AUTHOR

...view details