TRS Parliamentary Party Meeting : 'రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలపై పార్లమెంట్‌లో బలమైన వాణి వినిపించండి' - TRS Parliamentary Party Meeting started
12:53 January 30
తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం
TRS Parliamentary Party Meeting : రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పార్లమెంట్ వేదికగా గట్టిగా పోరాడాలని తెరాస ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. రేపట్నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రగతిభవన్లో తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో రాజ్యసభ, లోక్సభ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదన్న ముఖ్యమంత్రి... చట్టపరంగా, న్యాయపరంగా రావాల్సినవి కూడా ఇవ్వడం లేదని అన్నట్లు సమాచారం.
ప్రగతిశీల పథంలో దూసుకెళ్తోన్న కొత్త రాష్ట్రానికి మరింత తోడ్పాటు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం... ఉద్దేశపూర్వకంగానే వివక్ష కనబరుస్తోందని ముఖ్యమంత్రి ఎంపీలతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. విభజన చట్టం హామీలు, ఆర్థికసంఘం సిఫార్సులు, పన్ను సంబంధిత బకాయిలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర హామీల అమలు సహా అన్ని విషయల్లోనూ తెలంగాణకు అన్యాయమే జరుగుతోందని అన్నట్లు సమాచారం. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో వాణి బలంగా వినిపించాలని ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గత సమావేశాల కంటె మరింత గట్టిగా పోరాడాలని సీఎం ఎంపీలకు సూచించినట్లు తెలిసింది. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వివిధ అంశాలకు సంబంధించి ప్రత్యేక నివేదిక రూపొందించిన ప్రభుత్వం... వాటిని ఎంపీలకు ఇచ్చింది.