ఆర్టీసీ సమ్మెపై మరింత కఠినంగా వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో శాశ్వత ప్రత్యామ్నాయ రవాణా విధానానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమ్మె పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోన్న రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇవాళ సాయంత్రం ఆరు గంటల్లోగా విధుల్లో చేరని కార్మికులు ఇక ఆర్టీసీ ఉద్యోగులు కారని మరోమారు స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ గుర్తించబోదని తెలిపారు.
సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మూడు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. మూడు నుంచి నాలుగు వేల ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుని నడపడం మొదటి ప్రత్యామ్నాయం. ఆర్టీసీ బస్సులు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్సు కలిగిన యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఉద్యోగావకాశం కల్పించడం రెండో ప్రతిపాదన. వారికి తక్షణం తగు శిక్షణ ఇచ్చి, బస్సులను యథావిధిగా నడపాలని భావిస్తున్నారు. ఆరు నుంచి ఏడు వేల వరకు ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వడం మూడో ప్రతిపాదన.