కర్ణాటక నుంచి కృష్ణా నదికి నీటి ప్రవాహ ఉద్ధృతి పెరిగినందున... రాష్ట్రంలో జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ఠ విద్యుత్ ఉత్పత్తి చేయాలని తెలంగాణ జెన్కో నిర్ణయించింది. దీనిపై ట్రాన్స్‌కో-జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు సమీక్షించారు. వారం రోజుల క్రితమే జూరాల, శ్రీశైలంలో ఉత్పత్తి ప్రారంభించారు. అప్పర్, లోయర్ జూరాలలో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా... ప్రవాహ ఉద్ధృతికి అనుగుణంగా వ్యూహాలు అనుసరించాలని అధికారులకు ఆయన సూచించారు.
పెరిగిన కృష్ణా ఉద్ధృతి... గరిష్ఠ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు
కృష్ణా నదికి వరద పోటెత్తుతున్నందున రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్ ఉత్పత్తి చేయాలని తెలంగాణ జెన్కో నిర్ణయించింది. కొన్నేళ్లుగా నీటి ప్రవాహం తక్కువగా ఉన్నందున అన్ని కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం ఉత్పత్తి చేయడం సాధ్యం కాలేదు.
నాగార్జునసాగర్, పులిచింతలలో ఉత్పత్తి వ్యవస్థలను జెన్కో సిద్ధం చేసింది. నాగార్జునసాగర్‌లో 815 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. నాగార్జునసాగర్ నుంచి నీరు విడుదలయితే పులిచింతలలో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. గత కొన్నేళ్లుగా కృష్ణా నది ప్రవాహం తగ్గుతూ వస్తున్నందున... జూరాల నుంచి పులిచింతల వరకు కేంద్రాల్లో ఒకేసారి పూర్తి సామర్థ్యం విద్యుత్ ఉత్పత్తి చేయడం ఇటీవల కాలంలో సాధ్యం కావడం లేదు. ఈ సారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు జెన్కో సర్వసన్నద్ధమైది.
ఇదీ చూడండి: 'అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలి'