తెలంగాణ

telangana

ETV Bharat / city

అటెన్షన్‌ ప్లీజ్‌... మీరు వెళ్లాలనుకుంటున్న రైళ్లు నిండిపోయాయి!

వరుసగా వస్తున్న పెద్ద పండగలతో రైళ్లలో ఇప్పటికే దాదాపుగా రిజర్వేషన్లు పూర్తయిపోయాయి. సంక్రాంతికి నాలుగు నెలల ముందే టికెట్లన్నీ అయిపోవడంతో పండుగ ప్రయాణాలు వ్యయప్రయాసలుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. కొవిడ్‌ నేపథ్యంలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. వెయిటింగ్‌ లిస్ట్​లోనూ దొరికే పరిస్థితి లేదు. జిల్లాలకు మరిన్నీ రైళ్లు పెంచాలని నిపుణులు, ప్రయాణికులు కోరుతున్నారు.

trains
trains

By

Published : Sep 27, 2020, 8:18 AM IST

దసరా.. దీపావళి.. జనవరిలో సంక్రాంతి... ఇవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వరుసగా వస్తున్న పెద్ద పండగలు. ఉద్యోగం, ఉపాధి కోసం నగరాలు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డవాళ్లు ఈ పండగలకు సొంతూరి బాట పడతారు. ఈ సమయాల్లో తిరిగే రైళ్లలో ఇప్పటికే దాదాపుగా రిజర్వేషన్లు పూర్తయిపోయాయి. నిరీక్షణ జాబితా (వెయిటింగ్‌ లిస్ట్‌)లోనూ దొరికే పరిస్థితి లేదు. సంక్రాంతికి నాలుగు నెలల ముందే టికెట్లన్నీ అయిపోవడంతో పండుగ ప్రయాణాలు వ్యయప్రయాసలుగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

రద్దీ రోజులు

జనవరి 14(2021) సంక్రాంతి నేపథ్యంలో 9వ తేదీ నుంచి 13 వరకు బాగా డిమాండ్‌ ఉంది. అలాగే అక్టోబరు 25న దసరాకు, నవంబరు 14న దీపావళికి రద్దీ కనిపిస్తోంది.

రైళ్ల సంఖ్య పెంచితేనే..

కొవిడ్‌ నేపథ్యంలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ స్టేషన్ల నుంచి వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు రద్దీ భారీగా ఉంది. చెన్నై వైపు నుంచి ఇటు రైళ్లే లేవు. హైదరాబాద్‌ నుంచి రాయలసీమ జిల్లాలకు నిజామాబాద్‌-రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ ఒక్క రైలే రాకపోకలు సాగిస్తోంది. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌ వైపు అతిస్వల్పంగానే రైళ్లున్నాయి. రైళ్లు పూర్తిగా తిరిగినప్పుడే పండగల సమయాల్లో చాలవు. ప్రస్తుతం పరిమితంగానే తిరుగుతున్నాయి. ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సంఖ్య పెంచడంతో పాటు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి తెలంగాణ జిల్లాలకు సబ్బర్బన్‌ సర్వీసులు పెంచాలని నిపుణులు, ప్రయాణికులు కోరుతున్నారు.

రైళ్లు తిరుగుతున్నది ప్రస్తుతం ఇలా..

  • ద.మ.రైల్వే నుంచి రాకపోకలు సాగించే రైళ్లు 24
  • జోన్‌ మీదుగా వచ్చిపోయేవి 32
  • రైళ్లు ఆగుతున్న స్టేషన్ల సంఖ్య 63
  • రోజుకు ప్రయాణికుల సంఖ్య 35,240

ఇదీ చదవండి :పాడలేనని చెప్పిన బాలుకు ఆ పాటతో జాతీయ అవార్డు

ABOUT THE AUTHOR

...view details