తెలంగాణ ప్రభుత్వం ఔషధనగరి ప్రారంభించడానికి ఏరోజు ముహూర్తం ఖరారు చేసినా రాష్ట్రవ్యాప్తంగా రైతులను సమీకరించి అడ్డుకుంటామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెరాస పతనం ఇక్కడి నుంచే మొదలవుతుందన్నారు. నేటితో (అక్టోబరు 11) ఔషధనగరి ప్రజాభిప్రాయ సేకరణ జరిగి మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని బ్లాక్‌డేగా పాటిస్తూ కాంగ్రెస్ కిసాన్‌సెల్, ఔషధనగరి వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఆదివారం నిరసన సభ నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు నల్ల కండువాలు ధరించి పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేయండి..
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఔషధనగరిని అడ్డుకునేందుకు రాహుల్‌గాంధీ మద్దతు తీసుకుంటామని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే సేకరించిన భూములను రైతులకు తిరిగిస్తామన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేయండని.. కానీ, ప్రభుత్వం నిర్ణయించిన సొమ్మును చెల్లించొద్దని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఔషధనగరిని అడ్డుకునే పోరాటంలో పోలీసులు పేల్చే తొలి తూటాను ఎదుర్కొనేందుకు ముందుంటానన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. వెయ్యి మంది రైతులతో దిల్లీ జంతర్‌మంతర్ వద్ద దీక్షలు చేయడానికి సిద్ధం కావాలని సూచించారు.
ఔషధనగరి ఏర్పాటులో కేంద్రం పాత్రే ఎక్కువని, ఇప్పుడు భాజపా నేతలు గ్రామాలకు వచ్చి మొసలికన్నీరు కారుస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. ఔషధనగరిని వ్యతిరేకిస్తూ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభలో ఆమోదించారు.