Revanth Reddy About Warangal Declaration : రాహుల్ గాంధీ పాల్గొన్న రైతు సంఘర్షణ సభలో తీసుకున్న వరంగల్ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయించినట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాజీవ్‌గాంధీ వర్దంతి సందర్భంగా మే 21 నుంచి నెల రోజులపాటు రైతు రచ్చబండ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి ముఖ్యనాయకుడు 21వ తేదీన ఒక్కొక్క చరిత్రాత్మక గ్రామాల్లో రైతు రచ్చబండ నిర్వహించాలని సూచించారు. పీసీసీ అధ్యక్షుడిగా వరంగల్ జిల్లాలో జయశంకర్ సొంత గ్రామంలో రచ్చబండ సభలో పాల్గొంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 30 రోజులపాటు అన్ని గ్రామాల్లో రైతు రచ్చబండ కార్యక్రమాలు జరుగుతాయని రేవంత్ తెలిపారు. జూన్ 21 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు మినహాయించి మిగతా 15 నియోజకవర్గాల్లో 15 మంది ముఖ్యనాయకులను నియమించి రచ్చబండ సభలు విజయవంతం అయ్యేలా చూడాలని నేతలకు సూచించారు. జనజాగరణ్ అభియాన్ యాత్ర కార్యక్రమాలు...పెరిగిన ధరలపై కూడా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.