తెలంగాణ

telangana

ETV Bharat / city

TPCC: ఓ వైపు పార్టీ బలోపేతం.. మరోపక్క సమస్యలపై పోరాటం - తెలంగాణ రాజకీయాలు

కొత్తగా కొలువుదీరిన పీసీసీ కార్యవర్గం ప్రజాసమస్యలపై పోరుకు సిద్ధమవుతోంది. నిరుద్యోగ సమస్య, పెట్రోల్​ ధరల పెంపుపై ఆందోళనలు చేయాలని నిర్ణయించింది. ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్‌ ధరల పెరుగుదలపై నిరసన, 16న చలో రాజ్​భవన్​ కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానం చేసింది.

t congress
t congress

By

Published : Jul 9, 2021, 6:01 AM IST

పీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అధ్యక్షతన గురువారం.. గాంధీభవన్‌లో వరుస సమావేశాలు జరిగాయి. పీసీసీ కార్యవర్గంతో మొట్టమొదటిసారి సమావేశమైన రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్​, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వర్కింగ్​ ప్రెసిడెంట్లు పలు కీలక అంశాలపై చర్చించారు. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై పలువురి సభ్యుల అభిప్రాయాలను పీసీసీ సారధి రేవంత్‌ రెడ్డి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

దామోదరకు హుజురాబాద్​ బాధ్యత..

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, పెరిగిన పెట్రోల్‌ ధరలు, నిరుద్యోగ సమస్యలపైనా పీసీసీ చర్చించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం లక్ష 93 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని.. వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు. నిరుద్యోగ సమస్యపై 48 గంటలపాటు దీక్ష చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. అయిదుగురు వర్కింగ్​ ప్రెసిడెంట్లకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పని విభజన చేసి, బాధ్యతలు అప్పగించారు రేవంత్​రెడ్డి. హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నేతలతో మాట్లాడి తుది నిర్ణయానికి వస్తామని పీసీసీ తెలిపింది. ఈ వ్యవహారం అంతా పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్​ దామోదర రాజనర్సింహకు అప్పగించింది.

ఈ నెల 12న నిరసనలు..

పెట్రోల్‌ డీజిల్‌ ధరల పెంపుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం పిలుపునిచ్చింది. ఈ నెల 7 నుంచి 17 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాల పీసీసీలను ఆదేశించింది. అందులో భాగంగా ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ వెల్లడించింది. కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంటుందన్న భావనతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లెబాట పట్టారని ఆరోపించారు. అదేవిధంగా భాజపాకీ ప్రత్యామ్నాయం లేకనే.. పీసీసీ నూతన కార్యవర్గం బాధ్యతలు తీసుకొనే ముందురోజునే.. పాదయాత్ర చేస్తామని బండి సంజయ్​ ప్రకటించినట్లు హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు.

పీసీసీ అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీ విజయవంతం కావడం వల్లనే తమ పార్టీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారని ఏఐసీసీ అధికార ప్రతినిది దాసోజు శ్రవణ్​కుమార్​ ఆరోపించారు. రాబోయే రెండేళ్లపాటు తెరాస ప్రజావ్యతిరేక పాలనపై యుద్ధం చేయడానికి సంకల్పం తీసుకున్నట్లు చెప్పారు. ఇదే ఉత్సాహంతో పోరాటం చేస్తే.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. గురువారం బిజీబిజీగా గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గాంధీభవన్‌లో వరుస సమావేశాలు నిర్వహించారు. తొలుత సీనియర్ ఉపాధ్యక్షులు, మధ్యాహ్నం డీసీసీ అధ్యక్షులతో సమావేశమయ్యారు.

ఇదీచూడండి:SHARMILA: 'కలిసి భోజనాలు చేసిన సీఎంలు.. నీటి సమస్యపై ఎందుకు చర్చించరు?'

ABOUT THE AUTHOR

...view details