తమకు ఏనాడు 50 శాతం నీళ్లు కావాలని సీఎం కేసీఆర్ కోరలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తమకు 34 శాతం నీళ్లు కావాలని చెప్పిందే కేసీఆర్ అని.. 34 శాతం కృష్ణా నీళ్లు చాలని మంత్రిగా హరీశ్ సంతకం పెట్టారని రేవంత్ పేర్కొన్నారు. 7 ఏళ్లలో కేవలం 299 టీఎంసీలు వాడుకున్నామన్నారు. కృష్ణా నీటి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిని రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. ఈనెల 9వ తేదీన జరగనున్న కేఆర్‌ఎంబీ సమావేశం వాయిదా వేసుకోవాలని సీఎం ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. ఆ సమావేశానికి వెళ్లకుండా రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలను ఎందుకు పెంచుతున్నారని నిలదీశారు. ముఖ్యమంత్రిగా వెళ్లలేని పరిస్థితి ఉంటే... ప్రత్యామ్నాయంగా నీటిపారుదల శాఖపై పట్టున్న కడియం లేదా తుమ్మలను పంపించాలని సూచించారు. జులై 9న జరిగే కేఆర్ఎంబీ సమావేశానికి హాజరై వాదనలు వినిపించకపోతే ఏపీ సీఎం జగన్‌కు లొంగిపోయినట్లేనని రేవంత్ అన్నారు. కృష్ణా జలాల విషయంలో... వివాదం సృష్టించి సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి, రాజకీయ లబ్ధిపొందడానికే ప్రాజెక్టులను పెండింగ్‌లో ఉంచారని ఆరోపించారు.
'ఓట్ల ఎత్తుగడ..'
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు సామర్థ్యాన్ని రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. కృష్ణా జలాల విషయంలో లేని వివాదాన్ని... కేసీఆర్ సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ, ఆర్థిక లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, నీటి నుంచి ఓట్లు రాబట్టేందుకే ఈ ఎత్తుగడ అని విమర్శించారు. సీఎం కేసీఆర్ అనుమతి తీసుకున్న తరువాతనే రాయలసీమ ప్రాజెక్టును జగన్ ప్రారంభించారని, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లినప్పుడు కూడా బేసిన్‌లు లేవు.. భేషజాలు లేవని ప్రకటించిన విషయాన్ని.. రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.
కృష్ణా జలాలను వివాదాలు లేకుండా వినియోగించుకుంటామని ఏపీ 66 శాతం, తెలంగాణ 34 శాతం లెక్కన నీటిని వాడుకుంటామని సంతకాలు కూడా చేశారని రేవంత్ రెడ్డి వివరించారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా యాభై శాతం వాడుకుంటామని కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు. ఏపీ సీఎం జగన్ జీవో తెచ్చినప్పుడు, పనులు మొదలుపెట్టినప్పుడు.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సహా అందరి ఒత్తిడితోనే పాలమూరుకు చెందిన ఓ రైతు ఎన్జీటీలో వేసిన వ్యాజ్యంలో ప్రభుత్వం ఇంప్లీడ్ పిటిషన్ వేసిందని విమర్శించారు.