రాష్ట్రంలో రైతులు అధైర్యపడవద్దని.. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో ఉద్యమిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో ధాన్యం కుప్ప మీదే తనువు చాలించిన రైతు బీరయ్య కుటుంబానికి రేవంత్ భరోసా ఇచ్చారు. బీరయ్య కుమారుడు రాజేందర్‌తో రేవంత్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
పార్టీ అండగా ఉంటుంది..
కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఐలాపూర్‌కు చెందిన చిన్న బీరయ్య 10 రోజులుగా వడ్లు అమ్ముకోవడానికి వచ్చి.. కుప్ప మీదే గుండె ఆగి చనిపోయాడు. విషయం తెలుసుకున్న రేవంత్‌రెడ్డి.. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సుభాష్‌రెడ్డితో మాట్లాడారు. ఆ గ్రామానికి వెళ్లి బీరయ్య కుటుంబసభ్యులను పరామర్శించి.. సాయం చేయాలని సూచించారు. బాధితుల నివాసానికి వెళ్లిన సుభాష్‌రెడ్డి.. రేవంత్‌రెడ్డి చేత ఫోన్‌లో బీరయ్య కుమారునితో మాట్లాడించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించిన రేవంత్‌రెడ్డి.. ధైర్యం చెప్పారు. బీరయ్య కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.