తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉత్కంఠ వీడేనా? లాక్​డౌన్​పై నేడు మంత్రివర్గ భేటీ - లాక్​డౌన్​పై మంత్రివర్గ సమావేశంలో చర్చ

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన​ రాష్ట్ర మంత్రివర్గం నేడు భేటీ కానుంది. లాక్​డౌన్ కొనసాగింపు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులపై చర్చించనుంది. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సమాలోచనలు చేయనుంది. రాష్ట్రానికి నూతన సమగ్ర వ్యవసాయ విధానం, నీటిపారుదల అంశాలు సహా ఇతర అంశాలు చర్చకు రానున్నాయి.

tomarrow telangana cabinate meeting on lock down continuation in state
మంత్రివర్గ నిర్ణయంపై ఉత్కంఠ..!

By

Published : May 4, 2020, 5:49 PM IST

Updated : May 5, 2020, 6:06 AM IST

రాష్ట్రంలో లాక్​డౌన్​ అమలు, నూతన సమగ్ర వ్యవసాయ విధానంపై... ముఖ్యమంత్రి కేసీఆర్​ అధ్యక్షతన మంత్రివర్గం ఇవాళ మధ్యాహ్నం భేటీ కానుంది. కేంద్రం ఇచ్చిన సడలింపుల పట్ల అనుసరించాల్సిన వైఖరిపై కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, తీవ్రతపై సమీక్షించనున్నారు. రాష్ట్రంలో ఈ నెల 7 వరకు లాక్​డౌన్​ అమలులో ఉండగా... కేంద్రం ఈ నెల 17 వరకు పొడిగించింది.

ఆర్థిక కార్యకలాపాలపై..

రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా జిల్లాలను కేసుల తీవ్రత ఆధారంగా విభజించి... ఆర్థిక కార్యకలాపాలు జరిగేలా కేంద్రం పలు సడలింపులు ఇచ్చింది. కేంద్రం నిర్ణయంతో పొరుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. రాష్ట్రానికి చెందిన పలువురు మద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలన్న విషయంపై మంత్రివర్గం పూర్తి స్థాయిలో చర్చించనుంది.

కేసుల తీవ్రత శాతం తగ్గినప్పటికీ జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసుకొని తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ నిర్మాణ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చింది. మిగతా సడలింపులకు సంబంధించి కూడా ఏం చేయాలన్న విషయమై మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు.

కేసులు లేని జిల్లాలు, తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాలతో పాటు కేసులు అధికంగా ఉన్న జీహెచ్ఎంసీ సహా ఇతర ప్రాంతాల్లో ఎటువంటి వ్యూహం అనుసరించాలనేది కేబినెట్​లో చర్చించి నిర్ణయించనున్నారు. ఈ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, నిపుణులతో విస్తృతంగా చర్చిస్తున్న సీఎం.. వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ పర్యవసనాలను అంచనా వేస్తున్నారు.

సమగ్ర వ్యవసాయ విధానం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్లు సహా వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్​లో చర్చించనున్నారు. రాష్ట్రానికి నూతన సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్... అన్ని అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి సత్వర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నీటిపారుదల సహా ఇతర అంశాలపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఇదీ చూడండి:కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్​

Last Updated : May 5, 2020, 6:06 AM IST

ABOUT THE AUTHOR

...view details