తెలంగాణ

telangana

ETV Bharat / city

TTD Brahmotsavam 2021: శ్రీవారి ఆలయానికి చేరిన దర్బచాప, తాడు.. విశిష్టతలివిగో.. - ttd updates

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణంలో ఉపయోగించే దర్భ చాప, తాడును ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అటవీ సిబ్బంది తయారు చేసిన చాప, తాడును మహాద్వారం వద్ద ఆలయ సిబ్బందికి అందజేశారు. కాగా..ఈనెల 7న సాయంత్రం ముక్కోటి దేవతలను బహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహిస్తారు.

tirumala
tirumala

By

Published : Oct 5, 2021, 7:14 PM IST

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణంలో ఉపయోగించే దర్భ చాప, తాడును ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అటవీ సిబ్బంది తయారు చేసిన చాప, తాడును మహాద్వారం వద్ద ఆలయ సిబ్బందికి అందజేశారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ఈనెల 7న సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ధ్వజస్థంభానికి దర్భ చాపను చుట్టి, తాడుతో గరుడ పతాకాన్ని ఎగురవేస్తారు. శేషాచల అటవీ ప్రాంతంలో పెరిగే దర్భను సేకరించి తితిదే అటవీ సిబ్బంది.. చాప, తాడు తయారు చేశారు. 7 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో చాప, 211 అడుగుల పొడవు తాడును సిద్ధం చేశారు. ఊరేగింపుగా వాటిని ఆలయానికి తీసుకువచ్చారు. వీటిని రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై ఉంచారు. ఈ కార్యక్రమంలో తితిదే డీఎఫ్‌వో శ్రీ‌నివాసులు రెడ్డి, అటవీ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

ధ్వజారోహణంలో ఉపయోగించే దర్భ చాప, తాడు

ముమ్మరంగా ఏర్పాట్లు

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 7 నుంచి 15 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. కరోనా ప్రభావంతో ఏకాంతంగా ఆలయంలోని కల్యాణ మండపంలో వాహన సేవలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. ఉత్సవాల వేళ శ్రీవారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మాడవీధుల్లో దేవతా మూర్తుల.. ప్రతి రూపాలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్‌ దీపాలతో భారీ కటౌట్‌లను తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవమూర్తులను ఊరేగించే వాహన పటిష్టతను పరిశీలిస్తున్నారు. వాటికి అవసరమైన మరమ్మతులను చేసి సిద్ధం చేస్తున్నారు. సూర్యప్రభ వాహనం పరిమాణం పెద్దగా ఉండడంతో. ఆలయంలోకి తీసుకెళ్లేందుకు మహాద్వారం వద్ద ఇబ్బందిగా మారడంతో ఆ ప్రాంతంలో పాత వెండి వాహనాన్ని వినియోగించనున్నారు. తేరు రథాన్ని మరమ్మతులు చేసి ప్రయోగాత్మకంగా కొంతదూరం ముందుకు లాగారు.

రోజులు.. సేవలు..

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ శ్రీవారి ఆలయంలో కొయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయాన్ని శుద్ధి చేసి.. 6వ తేదీ సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 7న సాయంత్రం 5 గంటల 10 నిమిషాల నుంచి 30 నిమిషాల మీన‌ ల‌గ్నంలో మధ్య ధ్వజారోహ‌ణ కార్యక్రమం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి నిర్వహించే పెద్దశేష వాహ‌న సేవతో.. స్వామివారికి వాహన సేవలు ప్రారంభమవుతాయి. 8వ తేదీ ఉదయం చిన్న శేష వాహన సేవ, రాత్రి హంస వాహన సేవ నిర్వహిస్తారు. 9న ఉదయం సింహ వాహ‌నంపైన స్వామి వారిని ఊరేగించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు స్నప‌న‌ తిరుమంజ‌నం నిర్వహిస్తారు. అదే రాత్రి ముత్యపు పందిరి వాహ‌నంపై తిరుమలేశుడు భక్తులకు అభయం ఇవ్వనున్నారు. 10న ఉదయం క‌ల్పవృక్ష వాహ‌నంపై.. రాత్రి స‌ర్వభూపాల‌ వాహ‌నంపై స్వామి దర్శనమివ్వనున్నారు.

11న ఉదయం మోహినీ అవ‌తారంలో కనిపించనున్నారు. అదే రోజు రాత్రి గ‌రుడ‌సేవ‌ నిర్వహిస్తారు. 12న ఉదయం హ‌నుమంత వాహ‌నంపై శ్రీవారు దర్శనమిస్తారు. సాయంత్రం స్వర్ణర‌థానికి బ‌దులుగా స‌ర్వభూపాల వాహ‌నం మీద.. రాత్రి గ‌జవాహ‌నంపైనా విహరిస్తారు. 13న ఉదయం సూర్యప్రభ వాహ‌నం మీద రాత్రి చంద్రప్రభ వాహ‌నంపైన స్వామి దర్శనమిస్తారు. 14న ఉదయం ర‌థోత్సవానికి బ‌దులుగా స‌ర్వభూపాల వాహ‌నం మీద అభయమిస్తారు. రాత్రి అశ్వవాహ‌న సేవతో వాహన సేవలు ముగుస్తాయి.

15వ తేదీన చక్రస్నానంలో భాగంగా వేకువజామున ప‌ల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం, స్నప‌న‌ తిరుమంజ‌నం, చ‌క్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి జరిగే ధ్వజారోహ‌ణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు సాగే వాహన సేవలను ఆలయంలోని కల్యాణమండపంలో కొలువుదీర్చి వైదిక కార్యక్రమాలనూ నిర్వహించనున్నారు.

ఇదీచూడండి:Tirumala Temple : శ్రీవారి సన్నిధిలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

ABOUT THE AUTHOR

...view details