వయసుతో సంబంధం లేకుండా నేటి తరం యువత అన్నిరంగాల్లోనూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. సైన్స్, గణితం, శాస్త్ర సాంకేతికత... లాంటి ఎన్నో రంగాల్లో తమదైన ముద్రవేస్తూ కొత్త ఆవిష్కరణలకు తెరతీస్తున్నారు. ముఖ్యంగా భారతీయ మూలాలున్న వారు.. విదేశాల్లో తమదైన ప్రతిభతో మనదేశ కీర్తిని ఖండాంతరాలు దాటిస్తున్నారు. ఇందుకు ప్రతిఫలంగా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకుంటున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే 15 ఏళ్ల ఇండియన్ అమెరికన్ గీతాంజలి రావు. తన సాంకేతిక పరిశోధనలతో కలుషిత తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తనదైన కృషి చేస్తోందీ యంగ్ గర్ల్. దీంతో పాటు సైబర్ వేధింపులు, డ్రగ్స్ వాడకం లాంటి సామాజిక సమస్యలను టెక్నాలజీతో చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. ఈక్రమంలో తన సాంకేతిక పరిశోధనలను గుర్తించిన ప్రఖ్యాత టైమ్ పత్రిక ఈ యంగ్ సైంటిస్టును ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’గా గుర్తించింది.
5వేల మందితో పోటీ పడి!
వివిధ రంగాల్లో సత్తా చాటుతున్న యువతను ప్రోత్సహించేందుకు టైమ్ పత్రిక తొలిసారిగా ఈ ఏడాది 'కిడ్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ప్రవేశపెట్టింది. ఈనేపథ్యంలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం కోసం మొత్తం 5వేల మంది పోటీ పడ్డారు. వారందరినీ కాదని కొలరాడోలోని లోన్‌ట్రీలో నివసిస్తోన్న గీతాంజలి ఈ అవార్డుకు ఎంపికైంది. ఈ క్రమంలో ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ తనను వర్చువల్‌గా ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఈ సందర్భంగా తన పరిశోధనలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుందీ యంగ్ గర్ల్.
అందరి ముఖాల్లో నవ్వు చూడాలనే!
'నాకు చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే చాలా ఆసక్తి. సామాజిక మార్పు కోసం సైన్స్ అండ్ టెక్నాలజీని ఎలా వాడాలన్న ఆలోచన నాకు రెండు, మూడు తరగతుల్లో ఉన్నప్పుడే మొదలైంది. వీటి సహాయంతో అందరి ముఖాల్లో సంతోషాన్ని నింపాలన్న ఆశయంతోనే ముందుకెళుతున్నాను. ప్రస్తుతం ప్రపంచం ఇంతకుముందెన్నడూ చూడని పలు సమస్యలను ఎదుర్కొంటోంది. కరోనా లాంటి కొత్త సమస్యలతో పాటు ఇప్పటికీ ఉన్న పాత సమస్యలు మా తరాన్ని వెంటాడుతున్నాయి. అంతేకాకుండా మానవ హక్కుల సమస్యలూ ఉన్నాయి. వీటన్నింటినీ మేం సృష్టించలేదు. కానీ సైన్స్‌తో వాటికి పరిష్కారం చూపగలం. ఉదాహరణకు కలుషితమైన నీరు తాగడం వల్ల చాలామంది ఓపియాడ్ లాంటి రుగ్మతల బారిన పడుతున్నారని మా పరిశోధనల్లో స్పష్టమైంది. దీంతో పాటు డ్రగ్స్ వాడకం, సైబర్ వేధింపులు.. తదితర సమస్యలను సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించవచ్చు.'
నేను చేశానంటే...మీలో ఎవరైనా చేయగలరు!
'గమనించడం, ఆలోచించడం, పరిశోధించడం, ఫలితం సాధించడం, సమాచారం ఇవ్వడం.. ఇదే నా ప్రయోగ విధానం. సమాజంలో కనిపించిన ప్రతి సమస్యనూ మనం పరిష్కరించలేం. ఏ సమస్య అయితే మనల్ని బాగా కదిలిస్తుందో దానిపైనే దృష్టి పెట్టాలి. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సృజనాత్మకత, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆసక్తి కనబరిచే యువతతో ఒక అంతర్జాతీయ బృందాన్ని ఏర్పాటు చేయాలన్నదే నా ఆశయం. మిగతా వారు కూడా ఈ పరిశోధనలపై దృష్టి పెట్టాలి. నేను చేయగలిగానంటే...మీలో ఎవరైనా చేయగలరు..' అని అందరిలో స్ఫూర్తి నింపిందీ యంగ్ సైంటిస్ట్.
అదే నా లక్ష్యం!