YS Viveka Murder Case Updates : ఏపీ సీఎం జగన్ సొంత బాబాయి వివేకా హత్యకేసు విచారణ.. సీబీఐ సిబ్బందికి సవాళ్లు విరుసుతోంది. కడప వదిలి వెళ్లాలంటూ సిబ్బందికి బెదిరింపులు ఎదురవుతున్నాయి. విచారణ సైతం మందగించింది. చాలా మంది అధికారులు కడప నుంచి దిల్లీ వెళ్లిపోయారు. కడపలో కేవలం సీబీఐకి చెందిన ఎస్ఐ స్థాయి అధికారి,మరో ముగ్గురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. నిత్యం వీరు రెండు వాహనాల్లో.. కడప అతిథి గృహం నుంచి కేంద్ర కారాగారం అతిథి గృహానికి వెళ్లి వస్తుంటారు.
YS Viveka Murder Case Latest Updates : ఈనెల 8న మధ్యాహ్నం కడప నుంచి కేంద్ర కారాగారం సమీపంలోని పంజాబీ డాబాలో భోజనం తెచ్చేందుకు .. సీబీఐకి చెందిన ఇన్నోవా వాహనంలో డ్రైవర్ వలీబాషా వెళ్లాడు. పాత బైపాస్‌లోని పద్మావతి వీధి నుంచి వాహనం వెళ్తుండగా ముసుగు ధరించిన వ్యక్తి దాన్ని అడ్డగించాడు. బాంబు లేసి లేపేస్తాను విజయవాడ వెళ్లి పోవాలని అతను బెదిరించినట్లు సీబీఐ వాహన డ్రైవర్ చిన్నచౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేకా కేసు విచారణ చేస్తున్న బృందాన్నీ తిరిగి వెళ్లాలని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ముసుగు ధరించిన వ్యక్తి సీబీఐకి చెందిన మరో వాహన కదలికలనూ వారం నుంచి గమనిస్తున్నట్లు చెప్పాడని వెల్లడించాడు.