‘ఏకీకృతానికి’ ఎన్ని రోజులు?
పంచాయతీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒకే విధమైన సర్వీసు నిబంధనలు వర్తించే ఏకీకృత సర్వీస్ నిబంధనల సమస్య 1998 నుంచి చిక్కు వీడలేదు. ఇది పరిష్కారం కాకపోవడంతో పర్యవేక్షణ అధికారులు లేక పాఠశాల విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వాస్తవానికి ప్రభుత్వాలు ఈ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటే న్యాయస్థానాల్లో ఎప్పుడో తీర్పువెలువడేదని నిపుణులు చెబుతున్నారు.
పదోన్నతులేవీ?
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. ఆరేళ్లు గడుస్తున్నా మళ్లీ ప్రమోషన్లు లేవు. గత ఏడాది అన్ని శాఖల్లో పదోన్నతులు ఇచ్చినా.. పాఠశాల విద్యా శాఖలో మాత్రం ఇవ్వకపోవడం గమనార్హం. యాజమాన్యాలవారీగా పదోన్నతులు ఇస్తామని గత మార్చిలో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయినా, ఇప్పటివరకు అది నెరవేరలేదు.
ఏకీకృత సర్వీస్ నిబంధనల సమస్య పరిష్కారం కాకున్నా సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్‌జీటీ)లకు స్కూల్ అసిస్టెంట్లు(ఎస్‌ఏ)గా, ఎస్‌ఏలకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించవచ్చు. అలా దాదాపు 2 వేల మంది ప్రధానోపాధ్యాయులు, 7,500 మంది స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు దక్కే అవకాశం ఉంది. అయినా, ఆ దిశగా చర్యలు లేవు. దీంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తలెత్తుతోంది.
భాషా పండితుల ఎదురుచూపులు
రాష్ట్రంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే గ్రేడ్-2 భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్ల హోదా కల్పిస్తామని ప్రభుత్వం 2017లో జీఓలు జారీ చేసింది. ఆ తర్వాత 2019లో మళ్లీ కొన్ని పోస్టులు కలిపి జీఓలు ఇచ్చింది. దానిపై న్యాయస్థానం స్టే ఇవ్వడంతో మళ్లీ గత ఫిబ్రవరిలో నిబంధనలను సవరించి జీఓ 2, 3లు జారీ చేసింది. అయినా, ఇప్పటివరకు వారికి హోదా దక్కలేదు. ఆ హోదా కోసం దాదాపు 10,446 మంది ఎదురుచూస్తున్నారు.
ఆరేళ్లు గడిచినా ‘ఆదర్శం’ అంతంతమాత్రం
ఆంగ్ల మాధ్యమ విద్యనందించే మోడల్(ఆదర్శ) పాఠశాలలు 2013లో ఏర్పాటయ్యాయి. వాటిలో పనిచేసే ఉపాధ్యాయులకు ఏడాది క్రితం వరకు సర్వీస్ నిబంధనలే లేవు. ఎనిమిదేళ్లు అవుతున్నా పదోన్నతులు, బదిలీలు లేవు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ వర్తించడం లేదు. ఆరోగ్య కార్డులు లేవు. మళ్లీ నియామక ప్రకటనా రాలేదు. 88 ప్రిన్సిపాళ్లు, 477 పీజీటీ, 985 టీజీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.