తెలంగాణ

telangana

ETV Bharat / city

సంతలో కొన్న చొక్కా... ప్రాణాలమీదకు తెచ్చింది..!

తక్కువ ధరకే వస్తుందని చొక్కాను కొన్న ఓ వ్యక్తికి అది ఇబ్బందులు తెచ్చిపెట్టింది. చలికాలంలో ఉపయోగపడుతుందని అనుకుంటే పోలీసులతో తన్నులు తినేలా చేసింది.

ప్రాణాల మీదకు తెచ్చిన చొక్కా

By

Published : Oct 9, 2019, 7:10 AM IST

ప్రాణాల మీదకు తెచ్చిన చొక్కా

చలి నుంచి తట్టుకునేందుకు కొనుక్కున్న చొక్కా గిరిజన రైతుకు ఇబ్బంది తెచ్చిపెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్​ విశాఖ మన్యంలో జరిగింది. పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీ వనభరగికి చెందిన రవి అనే గిరిజనుడు స్థానికంగా జరిగే సంతలో ముదురు ఆకుపచ్చ రంగు చొక్కా, బూట్లను కొన్నాడు. వాటిని ధరించి సమీపంలోని మరో గ్రామానికి వెళ్తుండగా అతడిని మావోయిస్టుగా భావించి, కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంతకాలం నుంచి మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తాను మావోయిస్టుని కాదని, చలితీవ్రతకు తట్టుకునేందుకు మందంగా ఉందని భావించి చొక్కాను కొన్నానని పోలీసులకు వివరించాడు. అయినా నమ్మకపోవటంతో, స్థానిక గిరిజన పెద్దలు ఎస్సై రాజారావును కలిసి రవికి చెందిన ఆధార్‌, రేషన్‌కార్డులను చూపించారు. వివరాలు సరిపోవటంతో చివరికి విడిచిపెట్టారు. కొనే దుస్తులపై మరింత జాగ్రత్తగా ఉండాలని స్థానిక గిరిజనులకు పోలీసులు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details