CAG REPORT : 'సభ ఆమోదం లేకుండా రూ.1.10 లక్షల కోట్ల ఖర్చు.. రాజ్యాంగ విరుద్ధం'
CAG REPORT : 2020-21 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో చూపని ఆర్దిక లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగినట్టు కాగ్ పేర్కొంది. 55 వేల కోట్ల రూపాయల ద్రవ్యలోటు, 35 వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉన్నట్టు స్పష్టం చేసింది. ఏపీ రుణాల మొత్తం 3 లక్షల 48 వేల కోట్లకు చేరినట్టు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబధించి ఆడిట్ నిర్వహించిన ఏపీ ప్రభుత్వ పద్దులను కాగ్ కార్యాలయం శాసనసభకు సమర్పించింది.
కాగ్ రిపోర్ట్
By
Published : Mar 26, 2022, 10:00 AM IST
2020-21లో బడ్జెట్‌లో చూపని ఆర్థిక లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయి
CAG REPORT : ఏపీ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.1,10,509.12 కోట్లను చట్టసభల ఆమోదం లేకుండానే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఖర్చు చేసిందని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆక్షేపించింది. 2014-15 నుంచి 2019-20 మధ్య ఇలా చేసిన ఖర్చుకు ఇంకా శాసనసభ ఆమోదం పొందాల్సి ఉందనీ ప్రస్తావించింది. గత ఏడాదిలో 103 రోజుల పాటు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం వినియోగించుకుంటే తప్ప రాష్ట్రం రోజు గడవని పరిస్థితి ఏర్పడిందని ఎత్తిచూపింది. ఏపీ ఖజానాలో ఇతరత్రా ఏ ఆసరా లేకుండా కనీస నిల్వ నిధులున్నది ఏడాదిలో 34 రోజులు మాత్రమేనని గుర్తు చేసింది. 2020-21లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్ రూపొందించిన లెక్కలను ప్రభుత్వం శుక్రవారం శాసనసభ ముందుంచింది. ఈ నివేదిక పై విషయాలన్నింటినీ ప్రముఖంగా ప్రస్తావించింది.
"ద్రవ్య వినిమయానికి రాష్ట్ర చట్టసభల ఆమోదం లేకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులు వినియోగించకూడదు. అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 204, 205 దీన్ని స్పష్టంగా పేర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.1,10,509.12 కోట్లు ఇలా బడ్జెట్ ఆమోదం లేకుండానే ఖర్చు చేశారు. ఆ ఆర్థిక సంవత్సరంలో శాసనసభ అయిదు గ్రాంట్లకు ఆమోదం తెలియజేసినా అది దాటి మరీ.. అదనంగా ఎలాంటి ఆమోదం లేకుండా ఈ నిధులు ఖర్చు చేశారు."
-కాగ్ నివేదిక
రోజువారీ కనీస నిల్వ రూ.1.94 కోట్లు ఉంటేనే.. :రిజర్వు బ్యాంకుతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రోజూ కనీసం రూ.1.94 కోట్ల నిల్వ బ్యాంకులో ఉండేలా చూసుకోవాలి. ఆ నిల్వలు లేకపోతే ఆర్‌బీఐ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సు, ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం, ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో నిధులు వినియోగించుకునే అవకాశం ఇస్తుంది. వాటికి వడ్డీ చెల్లించాలి. ప్రభుత్వ రోజువారీ వ్యవహారాల నిర్వహణకు ఈ వెసులుబాటు ఉంటుంది. నిర్దిష్ట పరిమితికి మించి ఓవర్ డ్రాఫ్ట్ వెసులుబాటు ఉండదు. ఈ పరిమితులు ఎలా వినియోగించుకున్నారనే దాన్ని బట్టే రాష్ట్ర క్రెడిట్ రేటింగ్ ఉంటుంది. బహిరంగ మార్కెట్లో రుణం పొందేందుకు ఈ రేటింగే ముఖ్యం.
ఖజానా విధానాలు పక్కదోవ.. :‘ఆంధ్రప్రదేశ్‌లో 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.48,284.31 కోట్లు ట్రెజరీ కోడ్, ట్రెజరీ విధానాలు పాటించకుండా సీఎఫ్‌ఎంఎస్ ద్వారా చెల్లింపులు జరిపారు. సీఎఫ్‌ఎంఎస్‌లో ప్రత్యేక బిల్లుల ద్వారా ఈ ప్రక్రియ చేపట్టారు. ట్రెజరీ కోడ్ ద్వారా అధికారికంగా చెల్లించలేదు. కన్సాలిడేటెడ్ ఫండ్, పబ్లిక్ ఖాతాల మధ్య సర్దుబాటులతో ఈ చెల్లింపులు జరిగాయి’ అని కాగ్ నివేదిక తప్పుబట్టింది. ఈ నివేదికలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గిరీష్‌చంద్ర ముర్ము తొలుత సర్టిఫికేషన్ పేరుతో తన పరిశీలనలు జోడించారు. అందులోనే ఈ అంశాలను పేర్కొన్నారు.
‘రాష్ట్రాలు తీసుకునే బడ్జెటేతర రుణాలనూ బయటపెట్టాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల ద్వారా రూ.38,312.70 కోట్లు రుణంగా తీసుకుంది. 2021 మార్చి నెలాఖరుకు మరో రూ.86,259.82 కోట్లు బడ్జెట్‌కు ఆవల రుణాలుగా స్వీకరించింది. బడ్జెట్‌లో ఈ వివరాలేవీ వెల్లడించలేదు’ అని ముర్ము ప్రస్తావించారు. ఈ అంశాలపై ఆడిట్ గుర్తించిన అంశాలను ప్రత్యేకంగా ఫైనాన్సు ఆడిట్ నివేదికలో వెల్లడిస్తున్నామని ఆయన ప్రస్తావించినా ఆ నివేదిక ఇంకా వెలుగు చూడలేదు.
కాగ్ ప్రస్తావించిన అంశాలు..:సాధారణంగా బిల్లులను ఆయా శాఖల డీడీవోలు ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా సిద్ధం చేస్తారు. అందుబాటులో ఉన్న బడ్జెట్, బడ్జెట్ విడుదల ఉత్తర్వుల ఆధారంగా జిల్లా ఖజానా అధికారులు చెల్లిస్తారు.
బడ్జెట్ విడుదల ఉత్తర్వులు లేకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రూ.8,891.33 కోట్లు చెల్లించారు.
వివిధ పథకాలు, స్థానిక సంస్థలకు మరో రూ.26,839.60 కోట్లు చెల్లించారు. వీటి ప్రభుత్వ ఉత్తర్వులు ఆర్థికశాఖ అందించినా ఇలా ట్రెజరీ కోడ్ ఉల్లంఘించడానికి కారణం సరిగా విశదీకరించలేదు.
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ విధానం పాటించకుండా కంపెనీ చట్టం కింద ఏర్పడ్డ సీఎఫ్‌ఎస్‌ఎస్ (ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్) నుంచే చెల్లింపులు జరిపారు. ఇది ట్రెజరీ కోడ్‌కు విరుద్ధం.
ఈ చెల్లింపులపై కాగ్ అకౌంటింగ్ అధికారులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాక ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఈ ప్రక్రియను ర్యాటిఫై చేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీనిపై ఆర్థికశాఖ వివరణ సంతృప్తికరంగా లేదని కాగ్ అభిప్రాయపడింది. ఇలా ట్రెజరీ విధానాలు పాటించకుండా ప్రభుత్వం ఖర్చు చేస్తే అవకతవకలకు ఆస్కారం ఉంటుంది.
కోర్టు భవనాలకు రూపాయీ ఇవ్వలేదు!..:గతంలో చేపట్టిన కోర్టు భవనాలు, వంతెనలు, రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని 2020-21 ఆర్థిక సంవత్సర అకౌంట్లకు సంబంధించి కాగ్ తన నివేదికలో పేర్కొంది. కొన్నింటికి రూపాయి కూడా ఇవ్వకపోగా, మరికొన్నింటికి మొక్కుబడిగా విదిల్చింది.
విజయవాడలోని పాత సబ్ కోర్టు భవనం స్థానంలో రూ.86.60 కోట్లతో బహుళ అంతస్తుల కోర్టు భవనాల నిర్మాణం 2018 మే నెలలో ఆరంభించారు. ఇది 2019 నవంబరు నాటికి పూర్తికావాలి. 2021 మార్చి ఆఖరుకు 42% పనులే జరిగాయి. 2020-21లో ఈ నిర్మాణం కోసం రూపాయి కూడా వెచ్చించలేదు. కృష్ణాజిల్లా నందిగామలోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాలు నిర్మాణం రూ.4.40 కోట్లతో 2018 అక్టోబరు ఆరంభించారు. ఏడాదిలో పనులు పూర్తిచేయాలి. కానీ 2021 మార్చి చివరికి 11% పనులే జరిగాయి. 2020-21లో వీటికీ నిధులు ఖర్చుచేయలేదు.
రహదారులు, వంతెనలకూ ఇంతే.. విజయవాడ నుంచి విస్సన్నపేట మధ్య రూ.13.60 కోట్లతో 12 కి.మీ. రహదారి విస్తరణ పనులు 2018 నవంబరులో మొదలుపెట్టారు. ఏడాదిలో పూర్తికావాల్సి ఉండగా 34% పనులే జరిగాయి. వీటికి 2020-21లో రూ.5.16 కోట్లే ఇచ్చారు. పోరంకి వద్ద బందరు కాల్వపై రూ.30 కోట్లతో వంతెనను 2019 జనవరిలో మంజూరుచేశారు. ఏడాదిలో వంతెన పూర్తికావాలి. కానీ 2020-21లో నిధులు ఇవ్వకపోవడంతో అసలు పనులే జరగలేదు. కృష్ణాజిల్లా రుద్రపాకలో రూ.1.97 కోట్లతో, లక్ష్మీపురంలో రూ.1.82 కోట్లతో, పెదపారుపూడిలో రూ.1.82 కోట్లతో పీహెచ్‌సీల నిర్మాణం 2020లో చేపట్టారు. అయితే 2020-21 నిధులు విడుదల చేయలేదు.