సాధారణ వైద్యులు రోగులకు సేవలందించేందుకు నిర్వహించే ప్రైవేటు ఆస్పత్రుల మాదిరిగానే వ్యవసాయం, దాని అనుబంధ రంగాల ‘చికిత్స’కు పల్లెల్లో అగ్రి క్లినిక్(ఏసీ)ల ఏర్పాటును ప్రోత్సహించాలని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది. వ్యవసాయోత్పత్తులతో వాణిజ్యం చేయడానికి వ్యవసాయ వాణిజ్య కేంద్రం(ఏబీసీ) ఉపయోగపడుతుంది.
రైతుకు సాయం.. యువతకు ఆదాయం! - రైతులకు యువత సాయం
వ్యవసాయ రంగానికి, రైతులకు సేవలందిస్తూ ఆదాయం పొందడానికి ఇదో అవకాశం. శాస్త్రీయ శిక్షణతోపాటు రుణమిచ్చి సాయం చేయడానికి ‘వ్యవసాయ(అగ్రి) క్లినిక్, ‘వ్యవసాయ వాణిజ్య కేంద్రం’ పథకం అండగా నిలుస్తోంది. ఆసక్తితో ముందుకొచ్చే వ్యవసాయ, మేనేజ్‌మెంట్ డిగ్రీ పట్టభద్రులు, డిప్లమో ఉత్తీర్ణులను ప్రోత్సహించాలని కేంద్రం అన్ని బ్యాంకులు, నాబార్డు, రాష్ట్ర వ్యవసాయ శాఖకు తాజాగా సూచించింది.
ప్రతి గ్రామంలో కనీసం ఒక అగ్రిక్లినిక్‌ను వ్యవసాయ పట్టభద్రులతో ఏర్పాటు చేయించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని కేంద్రం అమలుచేస్తోంది. వ్యవసాయ డిగ్రీ లేదా వ్యవసాయం, మేనేజ్‌మెంట్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ చదివిన వారు, వ్యవసాయ డిప్లమో చేసినవారు ఏసీ లేదా ఏబీసీ పెట్టుకుని రైతులకు సేవలందించొచ్చు. ఇవి పెట్టుకోవడానికి ముందు రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ, నిర్వహణ సంస్థ(మేనేజ్)లో లేదా దాని గుర్తింపు పొందిన కాలేజీలో 45 రోజుల శిక్షణ పొందాలి. ఆ తర్వాత ఏసీ, ఏబీసీ పెట్టుకుంటామనే వివరాలతో ప్రాజెక్టు నివేదిక తయారుచేసి బ్యాంకులో దరఖాస్తు చేయాలి. ఒకరికైతే రూ.20 లక్షలు లేదా ఐదుగురు కలసి ఏసీ లేదా ఏబీసీ పెట్టుకుంటే రూ.కోటి రుణం ఇస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకైతే రూ.44 లక్షలు, ఇతరులకైతే రూ.36 లక్షలు రాయితీ వస్తుంది.
ఇప్పటికే 2,417 మందికి రుణాలు..
దేశంలో ఇప్పటికే 2,417 మందికి ఇలా రుణాలిచ్చినట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో 1,793 మంది శిక్షణ పొందగా 39 మందికి, ఏపీలో 1,373 మంది శిక్షణ పొందగా 31 మందికి రుణాలు, రాయితీలు మంజూరయ్యాయి. మహారాష్ట్రలో 481, కర్ణాటకలో 297, తమిళనాడులో 282, ఉత్తర్‌ప్రదేశ్‌లో 675 మందికి రుణాలు దక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో అర్హులెవరు దరఖాస్తు చేసినా 15 రోజుల్లో రాయితీ, రుణం మంజూరు చేస్తామని నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ యడ్ల కృష్ణారావు తెలిపారు.