పల్లెల్లో ఏటి నీటికి బదులు మద్యం వారి గొంతుల్లోకి పారుతోంది. మట్టివాసనను గంజాయి ఘాటు కమ్మేస్తోంది. శారీరక దృఢత్వాన్నిచ్చే ఆటలకు బదులు యువకులు క్రికెట్ బెట్టింగుల్లో కూరుకుపోతున్నారు. అందివచ్చిన అంతర్జాలం వారిని అశ్లీల బాట పట్టిస్తోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ వ్యసనాల జాడ్యం ఇప్పుడు పల్లెలకూ పాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
విచ్చలవిడిగా మద్యం
పదహారేళ్ల వయసులోనే మద్యం పార్టీలు చేసుకోవడం ఇప్పుడు పల్లెల్లో మామూలైంది. ఒకప్పుడు పండుగలు వస్తే యువకులంతా ఆటపాటలతో అలసిపోయేవారు.కానీ ఇప్పుడు చాలా మంది మద్యం పార్టీల్లో మునిగి తేలుతున్నారు. దీనికి ప్రధాన కారణం విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చిన బెల్టు దుకాణాలే. కుమురం భీం జిల్లా గూడెం గ్రామం జనాభా 2456 కాగా బెల్టు దుకాణాలు 22. ఆరువేల జనాభాఉన్న మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో 25, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివెన్నో.
గ్రామాల్లో గుప్పుమంటున్న గంజాయి
గ్రామీణ ప్రాంతాల్లోనూ గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్‌కు సరఫరా అవుతున్న గంజాయి గతంలో ముంబయి, బెంగళూరులకు వెళ్లేది. ఇప్పుడు స్థానిక గ్రామీణ ప్రాంతాలకూ మళ్లిస్తున్నారు. క్రమంగా స్థానిక మార్కెట్ విస్తరిస్తోందని, ముఖ్యంగా లాక్‌డౌన్ తర్వాత యువత అంతా గ్రామాలకు చేరుకోవడం కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది. కట్టడి చేయాల్సిన ఆబ్కారీశాఖ గ్రామీణ ప్రాంతాల్లో పటిష్ఠంగా లేకపోవడం, పోలీసులు ఇతరత్రా విధుల కారణంగా ఖాళీగా లేకపోవడంతో గంజాయి వాడకానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఆబ్కారీశాఖ గత ఏడాది రాష్ట్రంలో 257 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు దాదాపు ఐదువేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
కట్టలు తెగిన అశ్లీలం
గ్రామీణ వాతావరణాన్ని దెబ్బతీస్తున్న మరో జాడ్యం అశ్లీలం. స్మార్ట్‌ఫోన్లు, అంతర్జాలం సదుపాయం మారుమూల ప్రాంతాలకూ విస్తరించడంతో దీనిమాటున అశ్లీలం కూడా కమ్మేస్తోంది. సంచలనం సృష్టించిన దిశ ఉదంతం తర్వాత పోలీసులు జరిపిన పరిశీలనలో ఫోన్లలో నీలిచిత్రాలు చూస్తున్న యువతలో నేరప్రవృత్తి పెరుగుతున్నట్లు, ముఖ్యంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు తేలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్నతపాఠశాల విద్యార్థులు మహిళలు స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్లలో చిత్రీకరించడం కలకలం రేపింది. తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లలో అశ్లీల వీడియోలు చూస్తున్నారని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వాపోయారు. ఆన్‌లైన్ తరగతుల కారణంగా విద్యార్థులు, ఇంటి నుంచే పనితో యువత మొబైళ్లు, కంప్యూటర్లతోనే గడుపుతూ అశ్లీల చిత్రాలు చూసేందుకు అలవాటు పడ్డారు. పిల్లలు ఏం చూస్తున్నారో అనే ఆందోళన తల్లిదండ్రుల్లో ఉన్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి.
విస్తరించిన బెట్టింగ్ మహమ్మారి
గ్రామాలను కబళిస్తున్న మరో మహమ్మారి బెట్టింగ్. ఖాళీగా ఉంటున్న యువతతోపాటు చిన్నాచితకా పనులు చేసుకుంటున్న వారు కూడా బెట్టింగ్‌కు అలవాటుపడుతున్నారు.క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయంటే బెట్టింగ్ రాయుళ్ళకు పండుగే. ఒకప్పుడు నగరాలు, పట్టణాల్లో మాత్రమే బెట్టింగ్ జరిగేది. ఇప్పుడు చిటికెలోనే ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునేందుకు, బెట్టింగ్ కాసేందుకు కూడా అనేక యాప్‌లు అందుబాటులో ఉండటంతో గ్రామాల్లో పందెం రాయుళ్లు పెరిగిపోతున్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే గత ఏడాది బెట్టింగ్ కారణంగా రూ.15 కోట్లు చేతులు మారి ఉంటాయని పోలీసుల అంచనా. రాష్ట్రంలోని ప్రతి పల్లెలోనూ ఇప్పుడు బెట్టింగ్ మామూలైపోయింది.