Telangana State Police Recruitment Board: తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుళ్లస్థాయి ప్రాథమిక రాతపరీక్ష ఫలితాల వెల్లడి ఆలస్యం కానుంది. ఆగస్టు 7న 554 ఎస్సై స్థాయి పోస్టులకు పరీక్ష జరగ్గా.. 2,47,217 మంది హాజరయ్యారు. 28న 16,321 కానిస్టేబుళ్ల స్థాయి పోస్టులకు 6,03,955 మంది పరీక్షలు రాశారు. వీరంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి సెప్టెంబరులోనే ఫలితాలను వెల్లడించాలని మండలి నిర్ణయించింది. ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. అయితే సీఎం కేసీఆర్ శాసనసభలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్ని తగ్గిస్తామని ప్రకటించడంతో ఫలితాల వెల్లడికి బ్రేక్ పడింది. దీనిపై అధికారిక ఉత్తర్వులు వస్తేనే మండలి ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.
న్యాయపరమైన అడ్డంకులపై తర్జనభర్జన
కిందటిసారి జరిగిన మండలి నియామకాల్లో కటాఫ్ మార్కులు జనరల్ అభ్యర్థులకు 80.. బీసీలకు 70.. ఎస్సీ, ఎస్టీలకు 60గా ఉండేవి. 200 మార్కులకు ఆయా కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు సాధించిన వారిని ప్రాథమిక రాతపరీక్షలో అర్హులుగా పరిగణించి తదుపరి అంకానికి ఎంపిక చేసేవారు. ఈసారి కేటగిరీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు 60 మార్కులనే కటాఫ్‌గా నిర్ణయించారు. అయితే జనరల్, బీసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గించి.. తమకు మాత్రం తగ్గించలేదని ఎస్సీ, ఎస్టీవర్గాలు వాదిస్తున్నాయి. ఇది వడబోత ప్రక్రియేనని, అందరికీ సమానంగా కటాఫ్ నిర్ణయించామనేది మండలి వాదన. కానీ ముఖ్యమంత్రి ప్రకటనతో కటాఫ్ మార్కుల్లో మార్పులు అనివార్యమయ్యాయి. నోటిఫికేషన్‌కు భిన్నంగా ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కుల్ని తగ్గిస్తే కోర్టు కేసులు పడే అవకాశముందా? అని మండలి వర్గాలు ఆరా తీస్తున్నాయి.