రాష్ట్రంలో రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్లో తెలంగాణ రైతు సంఘం ఆందోళన చేపట్టింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద నాబార్డ్ తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 36 రోజులు గడుస్తున్నప్పటికీ... ఇంత వరకు రుణ ప్రణాళిక ఖరారు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ నగరంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి-ఎస్ఎల్బీసీ సమావేశం జరుగుతున్న వేళ... తమ నిరసన వ్యక్తం చేశారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, కంది, ఇతర పంటల సాగు విస్తీర్ణం పూర్తయినందున.. ఏకకాలంలో రుణమాఫీ చేసి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలని అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్ర రుణ ప్రణాళిక ఆమోదించి ప్రభుత్వం బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు.