తెలంగాణ

telangana

ETV Bharat / city

బిల్లు చెల్లించకపోతే.. కరెంట్ కనెక్షన్ కట్ - Electricity arrears in Telangana

మొండి విద్యుత్తు బకాయిలపై డిస్కం కొరడా ఝళిపిస్తోంది. వరసగా మూడు నాలుగు నెలలుగా బిల్లులు చెల్లించని విద్యుత్తు కనెక్షన్లకు కరెంట్‌ సరఫరా నిలిపేస్తోంది. కొద్దినెలలుగా నెలాఖరున డిస్కం ఇదే పనిచేస్తున్నా... ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో తమ కత్తెరకు మరింత పదును పెట్టింది. లక్ష్యం మేరకు బకాయిలు వసూలు చేయని అధికారులను బాధ్యులను చేస్తూ షోకాజ్‌ నోటీసులు ఇస్తుండటంతో యంత్రాంగమంతా క్షేత్రస్థాయిలో తిరుగుతూ బిల్లులు చెల్లించాలని అభ్యర్థిస్తున్నారు.

electricity arrears, telangana electricity
విద్యుత్ బకాయిలు, కరెంట్ కనెక్షన్లు

By

Published : Mar 29, 2021, 11:39 AM IST

గ్రేటర్‌ పరిధిలో 51 లక్షలకుపైగా విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. ప్రతినెలా 10 లక్షల కనెక్షన్లలో బకాయిలుంటాయి. వీటిలో మొండివి తక్కువే. కొవిడ్‌తో సొంతూళ్లకు వెళ్లడంతో నగరంలో కొన్ని ఇళ్లు ఇప్పటికీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వ్యాపారం లేక హోటళ్లు, హాస్టళ్ల నిర్వాహకులు కనీసం కరెంట్‌ బిల్లులు చెల్లించలేని పరిస్థితి. దీంతో బకాయిలు పెరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల సంగతి సరేసరి. మరోవైపు రెవెన్యూ సమస్య నుంచి గట్టెక్కాలంటే బకాయిల వసూళ్లు ఒక్కటే మార్గమని రెండువారాలుగా సిబ్బంది నుంచి సీఎండీ వరకు బిల్లుల వసూళ్లపైనే దృష్టిపెట్టారు. వెనుకబడిన సిబ్బంది, అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలతో చిక్కు..

గ్రేటర్‌లో హెచ్‌టీ, ఎల్‌టీ బిల్లింగ్‌ వెయ్యికోట్లపైనే ఉంటుంది. 9 సర్కిళ్ల పరిధిలో ఎల్‌టీలో మార్చినెల వసూలు కావాల్సిన బిల్లులు రూ. 450 కోట్ల వరకు ఉంటాయి. హైదరాబాద్‌ సౌత్‌, రాజేంద్రనగర్‌ తప్ప మిగతా సర్కిళ్లలో 90 శాతం వసూళ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. వందశాతం చేయాలనేది డిస్కం లక్ష్యం. ప్రతినెలా బకాయిలు పెరుగుతూ రూ.210 కోట్లకు చేరాయి.

రాష్ట్రవ్యాప్తంగా జనవరి నాటికి డిస్కంకు రూ.3వేల కోట్ల ఆదాయ లోటు ఏర్పడింది. గృహ కనెక్షన్లు, ప్రైవేటు సంస్థల్లో మొండి బకాయిలుంటే వెంటనే సరఫరా నిలిపేస్తున్నారు. ఎంతోకొంత వసూలవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల బకాయిలే సమస్యగా మారింది. కార్యాలయాలు, పాఠశాలలకు కరెంట్‌ సరఫరా నిలిపేయగానే ఆర్డీవో, కలెక్టర్‌ స్థాయి అధికారుల నుంచి విద్యుత్తు అధికారులకు ఫోన్లు వస్తున్నాయని, మధ్యలో తాము నలిగిపోతున్నామని విద్యుత్తు అధికారులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details