sankranti celebrations: సకల జనులకు అంతులేని సంతోషాలను మోసుకొచ్చే సంక్రాంతిని తెలుగు లోగిళ్లలో ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా, సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నగరవాసులు కుటుంబ సమేతంగా పతంగులు ఎగురవేస్తూ సంతోషంగా గడిపారు. అందరూ ఓ చోట చేరి గాలిపటాలతో సందడి చేశారు.
గంగిరెద్దు విన్యాసాలు..
హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసిస గాలిపటాలు ఎగురవేసి సందడి చేశారు. భోగి పండుగను పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గంగిరెద్దు విన్యాసాలను తిలకించారు. బసవన్నకు నూతన వస్త్రాలు అలంకరించి వేడుకలు నిర్వహించారు.
ఆకట్టుకున్న రంగవల్లిక..
ఆదిలాబాద్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళా కండక్టర్లు, ప్రయాణికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు స్పృశించేలా ఓ మహిళా ఉద్యోగి గీసిన రంగవల్లిక ఆకట్టుకుంది. విజేతలకు డిపో మేనేజరు జనార్దన్ బహుమతులు అందజేశారు. ఖమ్మం జిల్లా మధిర పురపాలికలోని పలు వార్డుల్లో యువజన సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్‌రాజ్ బహుమతులు అందజేశారు.
గోదాదేవి కల్యాణం..
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం శబరిమల సంకీర్తనలతో మార్మోగింది. భక్తులు భారీగా తరలివచ్చి మణికంఠుడిని దర్శించుకున్నారు. నిజామాబాద్ బాల్కొండలో అయ్యప్పస్వామి వార్షిక ఉత్సవాలను వైభవంగా జరిపారు. గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప స్వామిలకు అభిషేకం, అర్చనలు నిర్వహించారు.
ఇదీచూడండి: