రాష్ట్ర క్రీడా ప్రాధికారక సంస్థ ఆధ్వర్యంలో ఆదిలాబాద్, కరీంనగర్, హకీంపేట ప్రాంతాల్లో క్రీడా పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో 22 మంది క్రీడా శిక్షకులు విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా వనపర్తి(హాకీ), వరంగల్(అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్, జిమ్నాస్టిక్స్), ఖమ్మం(అథ్లెటిక్స్), హైదరాబాద్(సైక్లింగ్, రెజ్లింగ్), సరూర్‌నగర్(వాలీబాల్)లోని క్రీడా అకాడమీల్లో 8 మంది క్రీడా శిక్షకులు కాంట్రాక్ట్ అండ్ మెయింటెనెన్స్ గ్రాంట్ కింద విధులు నిర్వహిస్తున్నారు. వీటిలో సరిపడా శిక్షకులు లేని కారణంగా ఉత్సాహవంతులు క్రీడల్లో వెనకబడిపోతూ పతకాలను సాధించలేకపోతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 1992లో అప్పటి ప్రభుత్వం 33 మంది క్రీడా శిక్షకులను నియమించింది. ఇప్పుడు వారంతా పదవీ విరమణ పొందారు. తరవాత 1993, 1999, 2009లలో ఒప్పంద ప్రాతిపదికన మాత్రమే క్రీడా శిక్షకులను నియమించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కొత్తగా ఆదిలాబాద్‌లో క్రీడా పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలను నలుగురు శిక్షకులతో నడిపిస్తున్నారు.