రాష్ట్రంలోని న్యాయవ్యవస్థను ఏప్రిల్ 14 లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ లాక్డౌన్ చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. గతంలో మార్చి 31 వరకు ఇచ్చిన కోర్టుల మూసివేత ఉత్తర్వులను పొడిగిస్తూ... తాజా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని రకాల న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు, న్యాయసేవ, మధ్యవర్తిత్వ కేంద్రాలన్నీ ఏప్రిల్ 14 వరకు పనిచేయవని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. తదుపరి విచారణ తేదీలను న్యాయవాదులు, కక్షిదారులు వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవాలని సూచించింది.
అత్యవసర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్
ఉద్యోగులెవరూ కోర్టు కార్యాలయాలకు రావల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే జిల్లా కేంద్రం విడిచి వెళ్లవద్దని.. అత్యవసరమైతే విధులకు హాజరయ్యేలా సిద్ధంగా ఉండాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అత్యవసర అంశాల కోసం జిల్లా జడ్జిలు, మెజిస్ట్రేట్లు, రొటేషన్‌పై విధుల్లో ఉండాలని హైకోర్టు తెలిపింది. రిమాండ్, బెయిల్, ఇంజక్షన్ తదితర అత్యవసర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ లేదా స్కైప్ ద్వారా విచారణ చేపట్టాలని ఆదేశించింది.