తెలంగాణ

telangana

ETV Bharat / city

లండన్‌లో కేటీఆర్.. పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ - KTR UK tour latest news

KTR London Tour Updates : తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లండన్‌లో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనలో భాగంగా రెండో రోజున పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. లాయిడ్ గ్రూప్, పియర్స్, గ్లాక్సో స్మిత్‌క్లైవ్ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు.

KTR London Tour Updates
KTR London Tour Updates

By

Published : May 19, 2022, 7:01 PM IST

KTR London Tour Updates : రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ యూకే పర్యటనలో భాగంగా... రెండోరోజు పలు కంపెనీల సీనియర్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. థామస్ లాయిడ్ గ్రూప్ ఎండీ నందిత సెహగల్ తుల్లీ, సీనియర్ ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలో కొనసాగుతున్న తమ కంపెనీ కార్యకలాపాల విస్తరణపై చర్చించారు. పియర్సన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన మంత్రి కేటీఆర్, తెలంగాణలో నైపుణ్య శిక్షణ అభివృద్ధికి సంబంధించి చేపట్టిన పలు కార్యక్రమాలపైన వివరాలు తెలియజేశారు.

KTR London Tour Latest News : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్- టాస్క్‌తో పని చేసేందుకు రియల్ సంస్థ ముందుకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి ముందుకు వచ్చిన పియర్సన్ సంస్థకి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్ వారిని తెలంగాణకు ఆహ్వానించారు. క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌ హాల్ఫార్డ్ మంత్రి కేటీఆర్​తో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏరోనాటికల్ యూనివర్సిటీ ప్రయత్నాల పట్ల తాము ఆసక్తిగా ఉన్నట్లు కేటీఆర్​కు తెలిపారు. ప్రపంచ స్థాయి ఏరోనాటికల్ యూనివర్సిటీ తెలంగాణ కేంద్రంగా తీసుకువచ్చే తమ ప్రయత్నంలో కలిసి రావాలని మంత్రి.. క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ బృందానికి విజ్ఞప్తి చేశారు.

KTR in London: హెచ్ఎస్బీసీకి చెందిన పాల్ మెక్ పియార్సన్, బ్రాడ్ హిల్‌బర్న్‌లు మంత్రితో సమావేశమయ్యారు. హైదరాబాద్ నగరంలో తమ కంపెనీ కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయని, ఇప్పటికే తమకు బలమైన ప్రెజెన్స్ ఉందని తెలిపారు. తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ఇందుకు సంబంధించి త్వరలోనే స్పష్టమైన కార్యాచరణతో మరోసారి సమావేశం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

హైదరాబాద్ ఫార్మారంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న గ్లాక్సో స్మిత్ క్లైవ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ హెడ్ ఫ్రాంక్ రాయట్‌తో మంత్రి కేటీఆర్ లండన్‌లో సమావేశమయ్యారు. తమ విస్తరణ ప్రణాళికలు, ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్న తమ విభాగాల పురోగతిని కేటీఆర్‌కు ఫ్రాంక్ వివరించారు. జీఎస్కే నుంచి హాలియన్ పేరుతో కన్జ్యూమర్ హెల్త్ కేర్ విభాగం విడిపోయి స్వతంత్రంగా పనిచేస్తుందని తెలిపారు.

తమ కంపెనీ వ్యూహాల్లో హైదరాబాద్‌కు ఎల్లప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుందని ఫ్రాంక్ అన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో రూ. 710 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టామని.. 125 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పారు. గత రెండు సంవత్సరాల్లోనే దాదాపు 340 కోట్ల రూపాయలను హైదరాబాద్ ఫార్మాలో పెట్టుబడిగా పెట్టామని తెలిపారు. హైదరాబాద్‌లో తమ సేఫ్టీ , రెగ్యులేటరీ విభాగం ద్వారా విస్తరణ అవకాశాలను మరింత పెంచుకుంటామని ఫ్రాంక్ రాయట్ పేర్కొన్నారు. తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెడుతున్న గ్లాక్సో స్మిత్ క్లైవ్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details