కృష్ణా, గోదావరుల రాక కోసం ప్రాజెక్టులు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు తొలకరి ఆరంభంలోనే గోదావరి ఉపనది ప్రాణహితలోకి ప్రవాహం మొదలైంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద 14 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. గతేడాది వర్షాలు ఆలస్యం కావడంతో ప్రవాహాలూ నెమ్మదిగానే ప్రారంభమయ్యాయి. సెప్టెంబరు అనంతరం నదులు ఉగ్రరూపం దాల్చాయి. వందల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయి. ఈ సారి అంత ఆలస్యం కాకుండా ముందుగానే ప్రాజెక్టులు నిండాలని అన్నదాతలు కోరుకుంటున్నారు.
కృష్ణమ్మ రాక కోసం..
ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురిస్తే కర్ణాటకను దాటి కృష్ణమ్మ జూరాలను త్వరగా చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎగువ కృష్ణా ప్రాజెక్టులైన ఆలమట్టి, నారాయణపూర్‌లలో 108.7 టీఎంసీల మేర ఖాళీ ఉంది. గతేడు జులై 28న నారాయణపూర్ నుంచి దిగువకు వరదను విడుదల చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో 328.07 టీఎంసీల ఖాళీ ఉంది. తుంగభద్ర ప్రాజెక్టులో 94.71 టీఎంసీల ఖాళీ ఉంది. గతేడాది తుంగభద్ర నది నుంచి కూడా భారీ ప్రవాహం శ్రీశైలాన్ని చేరింది.
కాళేశ్వరం వైపే అందరి చూపు
ప్రాణహితలో ఇప్పటికే ప్రవాహం ప్రారంభం కావడం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది. గోదావరికి వరద ఆలస్యమైనా.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఎగువకు నీటిని ఎత్తిపోసుకునేందుకు వీలు ఉండటమే దీనికి కారణం. ఏటా కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లికి ముందుగానే వరద ప్రవహిస్తోంది. అక్కడి నుంచి మధ్యమానేరు ద్వారా కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని ఎత్తిపోసుకునేందుకు వీలుండటంతో ఈ ఏడాది ఆ ప్రాంత ఆయకట్టు రైతుల్లో ఆశలు రెట్టింపయ్యాయి. గోదావరి పరీవాహకంలో శ్రీరామసాగర్‌తో కలిపి అన్ని ప్రాజెక్టుల్లో 153.82 టీఎంసీల ఖాళీ ఉంది.
సమ్మక్క సాగరం పనులకు ఆటంకం
గోదావరికి వచ్చిన అనూహ్య వరదతో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో సమ్మక్క సాగరం బ్యారేజీ పనులకు ఆటంకం ఏర్పడింది. బ్యారేజీ చివరి పియర్ వరకు వెళ్లడానికి వేసిన తాత్కాలిక రహదారి వరద తీవ్రతకు కొట్టుకుపోయింది. 1 నుంచి 5 పియర్స్ వరకు పనులు జరుగుతున్న ప్రదేశాన్ని వరద నీరు ముంచెత్తింది. పైన గేట్ల బిగింపు పనులు మాత్రం కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి:నాన్న కోసం సైనికుడై.. దేశం కోసం అమరుడై..