పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని, జూన్ నాటికి నార్లాపూర్ పంప్ హౌస్ పనులు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ అధికారులను ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులు, ఇంజినీర్లతో హైదరాబాద్‌లో కార్యశాల నిర్వహించి ప్యాకేజీల వారిగా పనుల పురోగతిని సమీక్షించారు. ఈఎన్సీ మురళీధర్‌తో పాటు రెండు ప్రాజెక్టుల పరిధిలో పనిచేస్తున్న ఇంజినీర్లు, సంబంధిత అధికారులు, గుత్తేదార్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
'ఏడాదిలోగా పాలమూరు-రంగారెడ్డి.. ఆరు నెలల్లో డిండి పూర్తవ్వాలి' - telangana Irrigation Department Chief Secretary rajath kumar
ఏడాదిలోగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులను నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ఆదేశించారు. ఆరు నెలల్లోగా డిండి ప్రాజెక్టు పూర్తయ్యేలా పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
ప్రాజెక్టుల పనుల్లో క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు, భూసేకరణ పురోగతి గురించి రజత్ కుమార్ తెలుసుకున్నారు. ఆరు నెలల్లోగా డిండి, ఏడాదిలోగా పాలమూరు-రంగారెడ్డిని పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ధేశించిన గడువుకు అనుగుణంగా పనులు వేగవంతం చేయాలని ఇంజినీర్లకు స్పష్టం చేశారు. భూసేకరణ వెంటనే పూర్తి చేయాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
రెండు ప్రాజెక్టుల పనుల కోసం నిధుల కొరత లేదని, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని తెలిపారు.
- ఇదీ చూడండి :వ్యర్థాల నిర్వహణ కోసం కేంద్రం నుంచి నిధులు!